- కర్నూలు శివార్లలో పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టివేత
- బంగారం, వజ్రాల విలువ రూ. 2 కోట్ల 30 లక్షలుపైనే
- హైదరాబాద్‌కు చెందిన విజయ్ శర్మ, సురేష్ మునిస్వామి అరెస్ట్
- కారు, బంగారు ఆభరణాలు, వజ్రాలు సీజ్
- ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు సొత్తు అప్పగిస్తాం-కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు: బంగారం, వజ్రాల అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. స్మగ్లర్లు యధేచ్చగా జిల్లాలు.. రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. సోమవారం ఉదయం ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై అన్ని వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో కర్నూలు నగర శివార్లలో పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో కంగారు చూసి పోలీసులు అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. సాధారణంగా కనిపించే నల్లటి బ్యాగులో దాచిపెట్టిన బంగారు ఆభరణాలు, వజ్రాలు కనిపించాయి. హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి బోయినపల్లికి చెందిన విజయ్ శర్మ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని సరూర్ నగర్‌కు చెందిన సురేష్ మునిస్వామిలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. ఎటువంటి పన్ను చెల్లింపు బిల్లులు లేకుండా తరలిస్తున్న బంగారం 3.79 కేజీలు, వజ్రాలు 435 క్యారెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న సెబ్ సిఐ లక్ష్మీదుర్గయ్యకు, ఇతర పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఎలా పట్టుపడ్డారంటే…
తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద కర్నూలు తాలుకా పోలీసులు మరియు స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ (ఎస్ఎస్‌టి) బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ వైపు ( హైదరాబాద్) నుండి తమిళనాడులోని సేలంకు వెళ్తున్న మహింద్రా ఎక్స్‌యూవీ 300 టీఎస్ 10 ఈవీ 9199 నెంబర్ గల తెల్లటి కారును ఆపారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఒక బ్యాగులో భారీగా బంగారు ఆభరణాలు, చిన్న పాటి వజ్రాలు పట్టుబడాయి. ఈ కారులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన విజయ్ శర్మ, సరూర్ నగర్ కు చెందిన సురేష్ మునిస్వామి ఇద్దరు కలిసి హైదరాబాద్ నుండి తమిళనాడులోని సేలంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. సాధారణంగా కనిపించే నల్లటి బ్యాగులో పరీక్షగా చూస్తే తప్ప కనిపించని రీతిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు దాచి పెట్టుకుని తరలిస్తున్నారు.
హైదరాబాద్ నుండి తమిళనాడులోని సేలంకు స్మగ్లింగ్
ఈ ఆభరణాలను హైదరాబాద్ నగరంలోని ఆర్‌బీఆర్ అనే బంగారు వ్యాపార సంస్ధ నుండి తీసుకున్న ఆభరణాలను తమిళనాడులోని సేలంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి బంగారు ఆభరణాలు తరలించాలంటే జీఎస్టీతోపాటు ఆభరణాల బిల్లులు కూడా ఉండాలి. అలాగే అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులలో చెల్లించిన పన్నుల రశీదులు కూడా ఉండాలి. కారులో ఆభరణాలు తీసుకొస్తున్న వీరు సరైన బిల్లు (పత్రాలు)లు ఆధారాలు చూపలేకపోవడంతో ఎలక్షన్ ప్రోసిజర్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.
కళ్లు చెదిరే ఆభరణాలు, వజ్రాలు
పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ ఆభరణాలు, వజ్రాలు చూస్తుంటే కళ్లు చెదిరేంత అందంగా ఉన్నాయి. ఇందులో రింగ్స్- 61, నెక్లస్ సెట్ – 09, పెండెట్ సెట్ – 01, ఓన్లీ పెండెంట్ – 24, ఇయర్ రింగ్ – 06, జిమ్కిలు – 06, లెడిస్ టాప్స్ – 13, ఓన్లీ నెక్లస్ లు – 27, లేడిస్ బ్రాస్ లేట్ – 23, మొత్తం 170 ఐటమ్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని RBR గోల్డ్ & డైమాండ్స్ షాపు నుండి ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ ఆభరణాలను, కారును కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో మీడియా ఎదుట ప్రదర్శించారు.
కేసు నమోదు చేసిన కర్నూలు తాలుకా పోలీసులు
బంగారు, వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్న కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ క్రైమ్ నెంబర్ 83/2021 U/S … 102 CRPC క్రింద కేసు నమోదు చేశారు. తమ దర్యాప్తులో అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలిందని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న బంగారు, వజ్ర ఆభరణాలను ఇన్‌కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారికి అప్పగిస్తున్నామన్నారు. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 53 మండలాలో 53 స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. కర్ణాటక, తెలంగాణ నుండి అక్రమరవాణా మద్యం, నగదు అరికట్టుటుకు 10 ఇంటర్ స్టెట్ చెక్ పోస్టులు , 5 అంతర్ జిల్లా చెక్ పోస్టులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఎన్నికల నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో ఎస్ ఈ బి అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్, కర్నూలు తాలుకా సిఐ విక్రమసింహా, సెబ్ సిఐ లక్ష్మీదుర్గయ్య, ఎస్పీ పిఎ నాగరాజు, తాలుకా ఎస్సై ఖాజా వలి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు: కుటుంబ సభ్యులకు వాటాల ప్రకారం రేషన్
తొలి సారి డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు