
సూర్యాపేట, వెలుగు: పేదలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే సన్నబియ్యం పథకం తెచ్చామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలోని 85 శాతం ప్రజలకు, అంటే 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. మంగళవారం నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడారు.
దొడ్డు బియ్యం పంపిణీతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్నారు. పైగా దొడ్డు బియ్యం పక్కదారి పట్టాయని.. కోళ్ల ఫారాలు, బీర్ల కంపెనీలకు చేరాయని చెప్పారు. దీన్ని మార్చేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై ఆలోచించి సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా కార్యకర్తలపై దాడులు చేయించింది.. కేసులు పెట్టింది. వాటన్నింటినీ సహించి జనం కాంగ్రెస్‌ను గెలిపించారు. చింతలపాలెం మండలంలోని తమ్మవరం, పీక్లానాయక్ తండాల్లో జరిగిన దాడులను మర్చిపోం. మిత్తీకి మిత్తీ చెల్లిస్తాం” అని హెచ్చరించారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ..
రేషన్ కార్డుల జారీలోనూ నాటి బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యహరించారని ఉత్తమ్ మండిపడ్డారు. ఉప ఎన్నికల సమయంలో మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేసేవారన్నారు. ‘‘మా ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతో 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 2.85 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులతో కొత్తగా చేరేటోళ్లను కలుపుకుంటే ఆ సంఖ్య 3.10 కోట్లకు చేరుతుంది” అని వివరించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, త్వరలోనే పంపిణీ చేస్తామని వెల్లడించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.
అగ్రికల్చర్ కాలేజీ ఇవ్వండి..
ఉమ్మడి జిల్లాలన్నింటికీ ఒక అగ్రికల్చర్ కాలేజీ ఉందని, కానీ నల్గొండకు మాత్రం లేదని సీఎం రేవంత్ దృష్టికి ఉత్తమ్ తీసుకెళ్లారు. హుజూర్‌నగర్‌లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సూర్యాపేట జిల్లాకు కొత్తగా మంజూరైన నవోదయ స్కూల్‌ను కోదాడకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం రేవంత్ ఆమోదం తెలిపారు.