అచ్చంపేట, వెలుగు: దక్షిణ భారత అమరనాథ్ యాత్రగా పిలిచే నల్లమల సలేశ్వరం జాతర బుధవారం ప్రారంభమైంది. దట్టమైన అటవీ ప్రాంతంలో 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి లింగమయ్యను దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్లే ముందు వస్తున్నాం.. లింగమయ్య అంటూ.. తిరిగి వెళ్లే సమయంలో పోతున్నాం.. లింగమయ్యఅనే శరణుఘోషతో సలేశ్వర లోయ మారుమోగింది. చెంచు పూజారులు పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు.
మూడు రోజులపాటు ఉత్సవాలు
ఈ నెల 7 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అడవిలో ప్రయాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు. రాంపూర్ చెంచుపెంట వద్ద వెహికల్స్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం దగ్గరకు 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. 200 అడుగుల ఎత్తు నుంచి జాలు వారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు. దాతలు తాగునీరు, అన్నదానం చేశారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. భక్తులకు ఐటీడీఏ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అడవిలో ఎలాంటి అగ్నిప్రమాదం జరగకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. వన్య మృగాల సంచారం ఉండడంతో సాయంత్రం 5 గంటల తర్వాత అడవిలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఇక సలేశ్వరం లింగమయ్య జాతర చెంచుల జాతరగా చెప్పుకుంటారు. అయితే ఈ జాతరలో చెంచులను పట్టించుకోకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.