ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులు..వడ దెబ్బతో మూడు రోజుల్లోనే 19 మంది మృతి

ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులు..వడ దెబ్బతో మూడు రోజుల్లోనే 19 మంది మృతి
  • పది జిల్లాల్లో 44  డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు​ నమోదు
  • నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్​లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
  • అన్ని జిల్లాల్లోనూ దంచికొడ్తున్న ఎండలు
  • మరో రెండు రోజుల పాటు మరింత తీవ్రంగా హీట్​వేవ్స్​
  • నేడు 11 జిల్లాలకు.. రేపు 7 జిల్లాలకు రెడ్ ​అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడగాడ్పులు మరింత తీవ్రమయ్యాయి.  అన్ని జిల్లాల్లోనూ భారీ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ సెగలు ఎక్కువ కావడంతో ప్రజలు అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఎండ దెబ్బకు ప్రాణాలు పోతున్నాయి. బుధవారం మహబూబాబాద్​ జిల్లా మదనతుర్తి గ్రామంలో ఓ రైతు వడ్ల కుప్పపైనే ప్రాణాలు వదలడం స్థానికులను కంటతడి పెట్టించింది. 

సోమవారం 9 మంది, మంగళవారం ఐదుగురు, బుధవారం ఐదుగురు వడదెబ్బతో  ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈ మూడు రోజుల్లోనే 19 మంది  ఎండ దెబ్బతో చనిపోయారు. కాగా, మరో రెండు రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, కరీంనగర్​, మంచిర్యాల, ములుగు, నిర్మల్​, నిజామాబాద్​, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల (11 జిల్లాలు)కు రెడ్​ అలర్ట్​ ఇచ్చింది.

 మిగతా అన్ని జిల్లాలకూ ఆరెంజ్​ అలర్ట్​ను ఇష్యూ చేసింది. శుక్రవారానికి ఆదిలాబాద్​, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, రాజన్న సిరిసిల్ల (7 జిల్లాలు)కు రెడ్​ అలర్ట్​ను జారీ చేసింది. ఈ అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 44  డిగ్రీలకుపైగా నమోదయ్యే ప్రమాదముందని, వడగాడ్పులు అధికంగా సంభవిస్తాయని హెచ్చరించింది. అయితే, గురువారం హైదరాబాద్​ సిటీ, శుక్రవారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని వెల్లడించింది. 

10 జిల్లాల్లో హై టెంపరేచర్స్​

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం  ఎండలు ఠారెత్తించాయి. అని జిల్లాల్లోనూ 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 10 జిల్లాల్లో 44 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్​లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్​ జిల్లా మావల, నిజామాబాద్​ జిల్లా మెండోరాల్లో 44.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మంచిర్యాలలో 44.3, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 44.2, జగిత్యాల, కుమ్రంభీ ఆసిఫాబాద్​, పెద్దపల్లి జిల్లాల్లో 44.1, కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున హై టెంపరేచర్లు రికార్డయ్యాయి. 8 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 12 జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య, మరో 3  జిల్లాల్లో 41.6 నుంచి 41.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని​ వాతావరణ శాఖ హెచ్చరించింది.

బుధవారం ఐదుగురు మృతి

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న (56), నిర్మల్ ​జిల్లా ముథోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన గుమ్మల గంగారాం (40), వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటలో నాంపెల్లి రవళి (36) అనే వివాహిత, వికారాబాద్​ జిల్లా యాలాల  మండలం కోకట్​ గ్రామ శివారు గల రైల్వే ట్రాక్​ సమీపంలో ఓ వ్యక్తి వడ దెబ్బ తగిలి మృతి చెందాడు. మృతుడు 50 నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సు ఉంటాడని, ఐదడుగుల ఎత్తు, ఒంటిపై తెల్ల రంగు బనియన్​, నీలి రంగు చెక్స్​ కలిగిన లుంగీ ఉన్నాయని పోలీసులు తెలిపారు.