యూపీలో సర్వే హింసాత్మకం

యూపీలో సర్వే హింసాత్మకం
  • కోర్టు ఆదేశాలతో మసీదు వద్ద సర్వేకు వెళ్లిన అధికారులు
  • ఆందోళనకారుల దాడి.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి 

సంభాల్: యూపీలోని సంభాల్ లో ఆదివారం షామీ జామా మసీదు వద్ద చేపట్టిన సర్వే హింసాత్మకంగా మారింది. కోర్టు ఆదేశాలతో సర్వే చేయడానికి వెళ్లిన బృందంపై వందల సంఖ్యలో ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. మహిళలు సైతం ఇండ్లపై నుంచి రాళ్లు విసిరారు. దీంతో పలువురు అధికారులు, పోలీసులు గాయపడ్డారు. ఈ దాడిలో డిప్యూటీ కలెక్టర్  కాలికి ఫ్రాక్చర్  అయింది. ఆందోళనకారుల దాడితో ఉద్రిక్తత మొదలై పరిస్థితి చేయి దాటిపోతుండడంతో పోలీసులు టియర్  గ్యాస్ ప్రయోగించారు.

అనంతరం కాల్పులు జరపగా.. ముగ్గురు చనిపోయారు. అయితే, వారి మరణానికి కారణం తెలియరాలేదని, పోస్టుమార్టం తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కాగా.. షామీ జామా మసీదులో ఇంతకుముందు ఆలయం ఉండేదని, మొఘల్ రాజులు దానిని కూల్చి మసీదు కట్టారని ఆరోపిస్తూ స్థానిక కోర్టులో పిల్  దాఖలైంది. ఆ పిల్ పై విచారణ చేపట్టిన కోర్టు.. మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టాలని ఆదేశించింది.