కారు అయినా.. బైక్ అయినా.. బస్సు అయినా.. లారీ అయినా.. వెహికల్ ఏదైనా జర్నీలో గూగుల్ మ్యాప్ కామన్ అయిపోయింది. గతంలో దారి కోసం వాళ్లనూ వీళ్లనూ అడుగుతూ వెళ్లే జనం.. ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎంచక్కా వెళ్లిపోతున్నారు. కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్ ప్రాణాలను తీసేస్తుంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఇండియాలో జరిగింది. గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న కారు.. నిర్మాణంలోనే నది వంతెనపైకి వెళ్లింది. 100 కిలోమీటర్ల స్పీడ్ తో.. సగం పూర్తయిన బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకేసింది. 60 అడుగులు ఎత్తు నుంచి కారు నదిలో పడటం.. నదిలో నీళ్లు కూడా లేకపోవటంతో.. కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ లోని గురు గ్రామ్ నుంచి వివేక్ ,అమిత్ మరో వ్యక్తి కలిసి వివాహానికి హాజరయ్యేందుకు బరేలీకి బయలుదేరారు. గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్ళారు. అయితే కారు సగం పూర్తయిన ఫ్లైఓవర్ పై నుంచి 100 కి.మీ స్పీడ్ తో ఉన్న కారు నేరుగా 50 అడుగుల ఎత్తు నుంచి రామగంగ నదిలో పడిపోయింది. నదిలో నీళ్లు లేకపోవడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరిని వివేక్, అమిత్ గా గుర్తించారు మూడో వ్యక్తి ఎవరనేదానిపై ఆరాదీస్తున్నారు.
అయితే ఈ ఘటనపై ఫ్లైఓవర్ అసంపూర్తిగా నిర్మించిన అధికారులే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వంతెన నిర్మాణం ఎందుకు అసంపూర్తిగా ఉందని, నిర్మాణానికి ఒక చివర బారికేడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యానికి పాల్పడిన కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.