నర్సాపూర్, వెలుగు: మెదక్ -– హైదరాబాద్ నేషనల్ హైవే మీద నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు చనిపోయారు. చిలప్ చేడ్ మండలం రహీంగూడకు చెందిన గవర్నమెంట్ టీచర్ ననావత్ రవి, అమృత దంపతులు బైక్ మీద నర్సాపూర్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా స్పీడ్ గా వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. దీంతో రవి, అమృత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. మృతుడు రవి శివ్వంపేట మండలం పిల్లుట్ల స్కూల్ లో టీచర్ . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.
తూప్రాన్‌లో తండ్రి మృతి.. కొడుకు, బిడ్డకు గాయాలు
తూప్రాన్ : గుండె ఆపరేషన్ అయిన వ్యక్తిని చెకప్ కోసం కారులో తీసుకువెళ్తుండగా టైర్ పంక్చరై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి చనిపోగా, కొడుకు, బిడ్డ గాయపడ్డారు. మెదక్‌జిల్లా తూప్రాన్ ఎస్సై సురేశ్ కథనం ప్రకారం..
నిజామాబాద్ జిల్లాకు చెందిన పడిగెల బాపయ్యకు 15 రోజుల క్రితం గుండెపోటు రావడంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో సర్జరీ చేశారు. శుక్రవారం చెకప్ కోసం బాపయ్యతో పాటు ఆయన కొడుకు మల్కాని, బిడ్డ పద్మ కారులో బయలుదేరారు. మధ్యాహ్నం వేళలో తూప్రాన్బైపాస్రోడ్డుపై కారు టైర్ పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న బాపయ్య అక్కడికక్కడే చనిపోగా, బిడ్డ, కొడుకుకు గాయాలయ్యాయి.