బతుకు బాగు కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయ్.. అమెరికాలో ముగ్గురు భారతీయులు మృతి..

బతుకు బాగుపడుతుందని బయటి దేశాలకు వెళ్తే.. బతుకేలేక పోతున్నారు భారత విద్యార్థులు..ఎన్నడూ లేనంతగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్నారు. చదువుకోసం వెళ్లి కనుమరుగవుతున్నారు.  జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు.

ఈ నెల 14న జరిగిన ఘటన ఇప్పుడు బయటపడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. వీరందరూ 18 ఏళ్ల వయసు వారే  అని చెప్పారు. మృతులను అల్ఫారెట్టా హైస్కూల్, జార్జియా యూనివర్సిటీకి చెందిన ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల, అన్విశర్మగా గుర్తించారు. వీరిలో శ్రియ అవసరాల తెలుగమ్మాయి. రిత్విక్ సోమేపల్లి, మొహమ్మద్ లియాకత్‌ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో కారును డ్రైవ్ చేసింది లియాకత్ అని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ లో ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా అన్విశర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.