రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: శేరిలింగంపల్లి సెగ్మెంట్ లో 3 లక్షల మంది ఓటర్లకు ఒకే ఇంటి నంబర్ నమోదైనట్లు వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నట్టు రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ తెలిపారు. వివిధ శివారు ప్రాంతాలు, వేర్వేరు పాత గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో విలీనమైన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఇంటి నెంబర్లు ఒకే విధంగా నమోదైనట్లు ప్రాథమిక పరిశీలనలో తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు -చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లతో కూడిన 116 బృందాలు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సహకారంతో 1,114 అపార్ట్ మెంట్లలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాయన్నారు.