ప్రస్తుత జనరేషన్ లో ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ తోనే ముడిపడి ఉంది. ఏ పని చేయాలన్నా.. కావాలన్నా ఇంటర్నెటే మూలం అయిపోయింది. ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలున్నాయో... కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ప్రమాదాలూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మాల్వేర్ అనేది హానికరమైన వైరస్, ఇది ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్‌లలోకి చొరబడవచ్చు. ఈ మాల్వేర్ మన డేటా, గోప్యత(ప్రైవసీ)కి కూడా హాని కలిగించవచ్చు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం తాజాగా మూడు కొత్త మాల్వేర్‌లు కనుగొనబడ్డాయి. అంతే కాదు అవి చాలా ప్రమాదకరమైనవిగా కూడా తెలుస్తోంది. ఈ మూడు మాల్వేర్లూ యూజర్ల డేటాను దొంగిలించడం ద్వారా సిస్టమ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
సెక్యూరిటీ రీసెర్చ్ కంపెనీ నివేదిక ప్రకారం, ఇటీవల కనుగొన్న మూడు కొత్త మాల్వేర్ లలో.. డార్క్ గేట్, ఎమోటెట్, లోకిబాట్ ఉన్నాయి. ఈ మూడు మాల్వేర్‌లు అత్యంత ప్రమాదకరమైనవిగా తెలుస్తోంది. ఇవి హై-సెక్యూరిటీ సిస్టమ్‌లోకి ప్రవేశించి.. ఆ తర్వాత సిస్టమ్‌ను హ్యాంగ్ చేస్తాయి. ఈ మూడు మాల్వేర్లు యూజర్ల డేటాను వేగంగా దొంగిలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పరిశోధన ప్రకారం, ఈ మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఫైల్‌లు, ఇమెయిల్ ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది.
డార్క్ గేట్ మాల్వేర్
డార్క్‌గేట్ మాల్వేర్ మాల్వేర్ జూన్ 2023లో సెక్యూరిటీ రీసెర్చ్ కంపెనీ కాస్పెర్స్‌కీ పరిశోధనలో కనుగొన్నారు. ఈ మాల్వేర్ ఎంత ప్రమాదకరమైందో కూడా ఈ పరిశోధన వెల్లడించింది. ఇది సాధారణ డౌన్‌లోడ్ ఫంక్షన్ ను తీవ్రంగా దెబ్బతీస్తుందని, Windows డిఫెండర్‌ను డాడ్జ్ చేయడం ద్వారా బ్రౌజర్ హిస్టరీని సులభంగా దొంగిలిస్తుందని అంచనా వేసింది. ఇది మాత్రమే కాకుండా, డార్క్ గేట్ మాల్వేర్.. ఫైల్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లి ప్రాక్సీని మార్చడం, డేటాను దొంగిలించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.
ఎమోటెట్ మాల్వేర్
ఎమోటెట్ మాల్వేర్ ఒక బోట్‌నెట్. ఇది రావడం మొదటిసారేం కాదు. ఇంతకు ముందు 2021లోనే ఇది బహిర్గతమైంది. తాజాగా ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. ఇది వన్ నోట్ ఫైల్ ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుందని ఇంతకుముందే వెల్లడైంది. సిస్టమ్‌లో యాక్టివేట్ అయిన తర్వాత, ఇది ఇంటర్నెట్ ద్వారా చాలా హానికరమైన ఫైల్‌లను తనంతట తానే డౌన్‌లోడ్ చేస్తుంది.
లోకిబాట్ మాల్వేర్
లోకిబాట్ మాల్వేర్ ను మొదటిసారిగా 2016లో కనుగొన్నారు. బ్రౌజర్, ftp ఫైల్‌లతో సహా అనేక ఇతర యాప్‌ల నుంచి వివరాలను దొంగిలించడానికి హ్యాకర్లు ఈ మాల్వేర్‌ను రూపొందించారు. ఈ మాల్వేర్ ఎక్సెల్ డాక్యుమెంట్‌లో దాగి ఉంటుంది. ఇది సిస్టమ్‌లోకి ప్రవేశించిన తర్వాత డేటాను పాడు చేస్తుంది.