చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ ..​ ముగ్గురు మావోయిస్టులు మృతి

భద్రాచలం,వెలుగు : చత్తీస్​గఢ్​లో ఆదివారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో దట్టమైన అడవులు, గుట్టల్లో ఈ ఎన్​కౌంటర్​జరిగింది. బస్తర్ ​ఫైటర్స్, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా ఆదివారం కటే కల్యాణ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని తుమ్కాపాల్–-దబ్బకున్న గ్రామాల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 

ఇదే సమయంలో దర్బా డివిజన్​కు చెందిన మావోయిస్టు దళం తారసపడగా కాల్పులు మొదలయ్యాయి. 3 గంటల పాటు కాల్పులు జరిగి ఆగిపోయాయి. రాత్రి కావడంతో బలగాలు అక్కడే ఉన్నాయి. సోమవారం ఉదయం ఎన్​కౌంటర్​ జరిగిన ప్రదేశంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవసాహిత్యం, నిత్యావసర సరుకులు గుర్తించారు. దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి అదనపు బలగాలు చేరుకుని మృతదేహాలతో పాటు, స్వాధీనం చేసుకున్న వస్తువులను తీసుకువచ్చాయి. చనిపోయిన మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది.