చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

  • బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఘటన

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో గురువారం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న ముందస్తు సమాచారంతో సుక్మా నుంచి డీఆర్​జీ, ఎస్టీఎఫ్, సీఆర్​పీఎఫ్ కోబ్రా బలగాలు బుధవారం కూంబింగ్ ప్రారంభించినట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.

 ‘‘కూంబింగ్ పూర్తి చేసుకుని బేస్ క్యాంప్​కు తిరిగి వస్తున్న బలగాలపై.. సుక్మా జిల్లా బార్డర్​లోని పాలిగూడ – గుండరాజుగూడెం గ్రామాల అడవుల్లో మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు.. ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో మావోయిస్టులు పారిపోయారు” అని తెలిపారు. 

వారిని పోలీసు బలగాలు వెంబడించాయని ఎస్పీ చౌహాన్ తెలిపారు. ‘‘ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. బీజీఎల్ లాంచర్, రెండు తుపాకులు, పేలుడు సామాగ్రి, నిత్యవసర సరుకులు, విప్లవ సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నాం’’అని ఆయన తెలిపారు. 

మావోయిస్టుల కోసం బ్యాకప్ బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాళ్లంతా తిరిగి వచ్చాక చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది గుర్తిస్తామన్నారు. చనిపోయిన మావోయిస్టులు.. పీఎల్జీఏ, దక్షిణ బస్తర్ డివిజన్​కు చెందిన కీలక మావోయిస్టు నేతలుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.