రోజుకో టెక్నాలజీ పుంతలు తొక్కుతున్నా కొన్ని మారుమూల గ్రామాల్లో మాత్రం ఆనాటి పరిస్థితులు ఇంకా మారడం లేదు. న్యుమోనియా చికిత్సలో భాగంగా అత్యంత ప్రమాదకరమైన వేడి రాడ్ లతో చేసే చికిత్స మరోసారి ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనలో న్యుమోనియా వచ్చిన 3 నెలల పాపను 51 సార్లు వేడి ఇనుప రాడ్ తో కొట్టినట్టు తెలుస్తోంది. ఈ పద్దతి అక్కడ సాధారణమే అయినప్పటికీ... అది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. అయితే అప్పటికే వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది అయింది.
ఆ తర్వాత ఆ పాప ఆరోగ్యం క్షీణించడంతో షాదోల్ లోని మెడికల్ కాలేజీకి పంపారు. కానీ వేడి ఇనుప రాడ్ తో కొట్టడం వల్ల అది జరిగిన 15 రోజుల్లోపే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషయం పోస్టు మార్టం రిపోర్ట్ లో వెల్లడి కావడంతో షాదోల్ కలెక్టర్ వందనా వైద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిన్నారికి అది న్యుమోనియాకు చికిత్స చేయలేదని, అది ఆమె పరిస్థితిని మరింత దిగజార్చిందని తెలిపారు. అనంతకం స్థానిక అంగన్ వాడీ కార్యకర్త తన తల్లికి కౌన్సిలింగ్ చేసి, ఇలాంటి పనులు మరోసారి చేయకూడదని హెచ్చరించినట్టు సమాచారం.