మలక్‍పేట సేఫ్ పిల్లల హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో మూడు నెలల బాలుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సోమవారం(అక్టోబర్ 14) సాయంత్రం బాబును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారని, ఇంతలోనే మధ్యాహ్నం నర్స్ వచ్చి ఇంజెక్షన్ వేసిన 10 నిమిషాలకే బాబు మృతి చెందాడని బాలుడు తండ్రి హనుమంత్ ఆరోపించారు. బాలుడి మృతితో ఆస్పత్రి ముందు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
మహబూబ్ నగర్ జిల్లా, అక్కారంకు చెందిన కేతావత్ హనుమంత్ తమ 3 నెలల బాబు నిమోనియాతో అస్వస్థతకు గురవ్వడంతో ఈనెల అక్టోబర్ 9న మలక్‍పేట లోని సేఫ్ చిల్డర్న్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మూడు రోజుల నుంచి బాబును ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం బాబును పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం మెరుగైందని జనరల్ వార్డుకు మార్చారు. సోమవారం ఉదయం మరోసారి పరీక్షించిన వైద్యులు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఇంతలోనే మధ్యాహ్నం సమయంలో నర్స్ వచ్చి ఇంజెక్షన్ వేయగా.. వేసిన 10 నిమిషాలకే బాబు మృతి చెందాడని తండ్రి హనుమంత్ ఆరోపించారు.
ALSO READ | కుత్బుల్లాపూర్ లో తండ్రీకొడుకులపై వీధి కుక్కల దాడి..
బాబు చనిపోయిన కొద్దిసేపటికే పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారని బాలుడి తండ్రి ఆరోపించారు. బాబును తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ, వైద్యసేవలు అందించడంలో మాత్రం వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. హాస్పిటల్ సీజ్ చేసి, తమ కుమారుడి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.