- మిగిలిన ఐదుగురి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
గౌహతి:అస్సాంలో బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికుల్లో మరో ముగ్గురి మృతదేహాలను శనివారం వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. గత సోమవారం దిమా హసావో జిల్లాలోని ఉమ్రాంగ్సులో వినియోగంలోలేని బొగ్గు గనిలోకి తొమ్మిది మంది కార్మికులు దిగగా.. అకస్మాత్తుగా నీరు ఉప్పొంగడంతో వారంతా అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
ఆరోజు నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తున్న అధికారులు బుధవారం నేపాల్‌కు చెందిన ఒక కార్మికుడి డెడ్‌బాడీని క్వారీ నుంచి వెలికితీశారు. శనివారం మరో ముగ్గురు కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు.
వారిలో ఒకరు దిమా హసావోలోని కలమటి గ్రామం నంబర్ 1 నివాసి లిగెన్ మాగర్(27)గా గుర్తించారు. మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం తొమ్మిది మందిలో ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఉమ్రాంగ్సులో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ఆధ్వర్యంలో సహాయక చర్యలు పకడ్బందీగా కొనసాగుతున్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 340 అడుగుల లోతు ఉన్న క్వారీలోని నీటిని ఓఎన్జీసీ, కోల్ ఇండియా నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక యంత్రాలతో తొలగిస్తున్నట్టు తెలిపారు.
ఆ గనిని 12 సంవత్సరాల క్రితం వదిలివేసినట్టు సీఎం తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం వరకు అస్సాం ఖనిజ అభివృద్ధి సంస్థ కింద ఆ గని ఉందని, ఇల్లీగల్ గని కాదని సీఎం పేర్కొన్నారు. కార్మికులను గనిలోకి పంపిన వ్యక్తిని అరెస్టు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి..
అస్సాంలో జరిగిన గని ప్రమాదంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ శనివారం తెలిపారు.