- మృతుల్లో భార్యభర్తలు, కూతురు
- ఖమ్మం జిల్లా కొత్త కారాయిగూడెంలో విషాదం
పెనుబల్లి (ఖమ్మం), వెలుగు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. క్యాన్సర్ భయం ముగ్గురి ప్రాణాలు తీసింది. పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంకు చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (40), సుహాసిని (35) దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు కార్తిక్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. కూతురు అమృత (16) ఇంటర్ పూర్తిచేసి బీటెక్ లో సీట్ కోసం ఎదురు చూస్తూ ఇంటి దగ్గరే ఉంటున్నది. కృష్ణారావు తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుహాసిని కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నది. గర్భసంచిలో కణితి ఉండడంతో కృష్ణా జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 45 రోజుల క్రితం సర్జరీ చేయించారు. గడ్డను డాక్టర్లు టెస్టులకు పంపగా గర్భాశయానికి క్యాన్సర్ సోకిందని, ఫస్ట్స్టేజీలో ఉందని తేలింది. లివర్ కు కూడా ఎటాక్అయ్యిందని చెప్పారు. హైదరాబాద్ లో రేడియేషన్థెరపీ తీసుకుంటే తగ్గుతుందని సూచించారు.
అయితే, క్యాన్సర్ సోకితే కచ్చితంగా చనిపోతారనే అపోహను సుహాసిని పెంచుకుంది. కొడుకును చూడాలని ఉందని గురువారం గ్రామానికి పిలిపించారు. అనంతరం కృష్ణారావు, సుహాసిని, అమృత తిరువూరులోని హాస్పిటల్‌కు వెళ్తున్నామని అతడితో చెప్పి బైక్‌పై వెళ్లారు. అక్కడ డాక్టర్ ను కలిసి, నేరుగా సొంత ఊర్లోని మామిడితోటలోకి వెళ్లారు. తోట చివరలో బైక్ పార్క్‌చేసి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారు. గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతకూ రాకపోవడంతో కార్తిక్ ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే సాయంత్రమే వెళ్లిపోయారని చెప్పారు. దీంతో తిరువూరుతో పాటు ఊర్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం వేరే పొలానికి చెందిన వ్యక్తికి తోట వద్ద బైక్ కనిపించడంతో లోపలికి వెళ్లి చూడగా ముగ్గురూ చెట్టుకి ఉరి వేసుకుని కనిపించారు. సుహాసినికి క్యాన్సర్ సోకడంతో భయాందోళనకు గురై ముగ్గురూ సూసైడ్ చేసుకొని ఉంటారని సత్తుపల్లి రూరల్ సీఐ హనూక్ తెలిపారు.
కుమార్తెకు ఉరివేసి తల్లి సూసైడ్
- హైదరాబాద్ మణికొండలో ఘటన.. ఆర్థిక ఇబ్బందులే కారణం
గచ్చిబౌలి, వెలుగు : ఓ మహిళ తన బిడ్డకు ఉరివేసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని మణికొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. మణికొండలో ఆంధ్రాబ్యాంక్ దగ్గర్లో బుడ్డోలు సదానందం, అలివేలు(40) నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె లాస్య(14), కుమారుడు మణికంఠ(12) సంతానం. సదానందం ఏం పనిచేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. ఇంటికి వచ్చే రెంట్లతో అలివేలు కుటుంబాన్ని నెట్టుకువస్తున్నది. కరోనా టైం నుంచి కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఇంటి రెంట్లు సరిగా రావడం లేదు.
దీనికి తోడు భర్త ఖాళీగా తిరుగుతుండడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువై కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఫీజులు కట్టలేక పిల్లలను స్కూల్‌కు కూడా పంపించడం లేదు. ఈ క్రమంలో గురువారం భర్త సదానందంను యాదగిరిగుట్టకు వెళ్లి దేవుడిని దర్శనం చేసుకొని రావాలని చెప్పి ఖర్చులకు రూ.5 వేలు ఇచ్చి పంపించింది. అర్ధరాత్రి అలివేలు తన కుమార్తెకు బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసి.. ఆ తర్వాత కిచెన్‌లో తానూ సీలింగ్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. పక్కరూంలో పడుకున్న కుమారుడు తెల్లవారుజామున నిద్ర లేచి చూసి స్థానికులకు విషయం చెప్పాడు. కాగా, అలివేలు కుమారుడికి కూడా ఉరి వేసేందుకు మరో ఫ్యాన్‌కు చీర కట్టి వదిలేసింది.