కిచెన్ తెలంగాణ ఈ రెసిపీలు మ్యాంగో ఫ్లేవర్​!

కిచెన్ తెలంగాణ  ఈ రెసిపీలు మ్యాంగో ఫ్లేవర్​!

ఈ ఏడాది ఉగాదితో మామిడికాయ సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే పచ్చిమామిడికాయతో ఆవకాయ పెట్టడానికి రెడీ అయిపోయి ఉంటారు. అయితే పచ్చళ్లు, పులిహోరలతోపాటు.. మరెన్నో రుచులు ట్రై చేస్తున్నారు చాలామంది. అందులో వేసవి తాపాన్ని తగ్గించేందుకు మామిడికాయ రసం, శ్నాక్స్​లో సైడ్​ డిష్​గా 

గ్రీన్ చట్నీ.. అంతెందుకు.. చికెన్​  టిక్కా కూడా మ్యాంగో ఫ్లేవర్​తో ఈ లిస్ట్​లో ఉంది. 
మరింకెందుకాలస్యం.. ఆ రెసిపీల 
తయారీ ఇక్కడ చదివేయండి. 

చట్నీ 

కావాల్సినవి :

పచ్చిమామిడి కాయలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

జీలకర్ర - ఒక టీస్పూన్

ఉప్పు - సరిపడా

వెల్లుల్లి రెబ్బలు (పెద్దవి) - రెండు

అల్లం - చిన్న ముక్క

బెల్లం - ఒక టేబుల్ స్పూన్

కొత్తిమీర, పుదీనా తరుగు - రెండు కప్పులు

ఐస్​ ముక్కలు - రెండు

తయారీ :
పచ్చిమామిడి కాయల్ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీజార్​లో మామిడికాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, బెల్లం,  కొత్తిమీర, పుదీనా తరుగు, ఐస్​ వేసి మిక్సీ పట్టాలి. అంతే.. చిటికెలో చట్నీ రెడీ. దీన్ని సమోస, పకోడీ, బోండా వంటివాటితో తినొచ్చు. చపాతీ లేదా బ్రెడ్ శాండ్​ విచ్​లో వాడొచ్చు. అంతేకాదు.. అన్నంలో తిన్నా టేస్ట్ బాగుంటుంది. 

రసం​

కావాల్సినవి :

పచ్చిమామిడి కాయలు 

- రెండు, నీళ్లు, ఉప్పు - సరిపడా

పచ్చిమిర్చి - ఐదు

నూనె - మూడు టేబుల్ స్పూన్లు

ఎండుమిర్చి - నాలుగు

ఆవాలు - ఒక టీస్పూన్

కరివేపాకు - కొంచెం

ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు

జీలకర్ర, పసుపు - ఒక్కోటి పావు టీస్పూన్

ఇంగువ - అర టీస్పూన్

బెల్లం - ఒక టేబుల్ స్పూన్

కొత్తిమీర తరుగు - కొంచెం

తయారీ :
పచ్చిమామిడి కాయలకు నూనె పూసి, వాటిని కడ్డీకి గుచ్చి పైన చెక్కు నల్లగా మారేవరకు నేరుగా మంటలో కాల్చాలి. అలా కాల్చిన వాటిని వెంటనే నీళ్లలో వేయాలి. పచ్చిమిర్చిని కూడా అలాగే మంటలో కాల్చి, పక్కనపెట్టాలి. తర్వాత మామిడికాయల పైన ఉన్న తొక్క తీసి, ముక్కలుగా కోయాలి. మిక్సీజార్​లో మామిడి ముక్కలు, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, జీలకర్ర ఒక్కొక్కటిగా వేస్తూ వేగించాలి. అవన్నీ వేగాక రెడీగా ఉన్న మామిడి మిశ్రమం కూడా వేసి కలపాలి. తర్వాత పసుపు, ఇంగువ, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. చివరిగా బెల్లం వేసి మరోసారి కలపాలి. రసం బాగా మరిగి, తెర్లిన తర్వాత కొత్తిమీర తరుగు వేయాలి. 

టిక్కా 

కావాల్సినవి :

పచ్చిమామిడికాయ - ఒకటి

నీళ్లు, ఉప్పు - సరిపడా

అల్లం - చిన్న ముక్క

పచ్చిమిర్చి - రెండు

వెల్లుల్లి రెబ్బలు - ఏడు

బోన్​లెస్ చికెన్ - పావుకిలో 

పసుపు - పావు టీస్పూన్

కారం, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్

ధనియాల పొడి - అర టీస్పూన్

గరం మసాలా - ముప్పావు టీస్పూన్

పెరుగు - పావు కప్పు

తయారీ :
మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాలి. మిక్సీజార్​లో కొత్తిమీర, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్​లో వేసి బాగా కలపాలి. మూతపెట్టి గంటసేపు పక్కన పెట్టాలి.

 తర్వాత మూత తీసి అందులో రెడీగా ఉన్న మసాలా మిశ్రమం, మామిడికాయ గుజ్జు వేసి బాగా కలపాలి. మళ్లీ మూతపెట్టి మూడు గంటలు పక్కన పెట్టాలి. ఆపై మూత తీసి, చికెన్ ముక్కల్ని టిక్కా చేయడానికి స్టిక్స్​కు గుచ్చాలి. వాటిని పాన్​ మీద నూనెతో కాల్చాలి. లేదా ఒవెన్​లో పెట్టి ఉడికించొచ్చు.