- భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: సజ్జనార్
- తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కితాబు
హైదరాబాద్,వెలుగు : టీజీఎస్ ఆర్టీసీలో త్వరలో మూడువేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటించారు. కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిందని ఆయన వెల్లడించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త బస్సులకు అనుగుణంగా ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సజ్జనార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమన్నారు. ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ‘బస్ కా పయ్యా నహీ చలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని గుర్తుచేశారు. “ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజుల పాటు ‘మేము సైతం’ అంటూ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. దేశ చరిత్రలో అతిపెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచింది. ఈ సమ్మెలో 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని రాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు”
అని సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుండడం వల్లే మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతోందన్నారు. దాదాపు ఏడేండ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న 2017 వేతన సవరణ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ను సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు. గత రెండేళ్లలో 1,500 కొత్త డీజిల్ బస్సులు కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలిపి మొత్తం 2,990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఆయన నివాళులర్పించారు.