పాక్ తో మూడు యుద్ధాలు.. పైచేయి ఎప్పుడూ మనదే!

‘ఇండియాతో యుద్దం అంటూ వస్తే మేం ఓడిపోవచ్చు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం చివరకు న్యూక్లియర్ వార్ గానే ముగుస్తుంది’ ఇమ్రాన్ ఖాన్ ఈ మాట ఎందుకు అన్నాడో తెలియాలంటే ఇండియా, పాకిస్థాన్ మధ్య  జరిగిన మూడు యుద్ధాల గురించి తెలుసుకోవాలి. ఈ మూడు యుద్దాల్లోనూ ఇండియాదే పైచేయి. ఈసారి కూడా యుద్ధం అంటూ జరిగితే ఇండియాదే పై చేయి అవుతుంది. ఈ సంగతి ఇమ్రాన్ ఖాన్ మాటలను బట్టి అర్థమైపోతుంది. దీంతో తమ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయన్న  సంగతి గుర్తు చేసి బెదిరింపులకు దిగుతున్నాడు ఇమ్రాన్ ఖాన్.

రెండో యుద్ధం–1971

ఈస్ట్​ పాకిస్థాన్​ విముక్తి కోసం…

ఒక దేశం పుట్టుకకు ఇండో–పాకిస్థాన్​ వార్​ కారణమైంది. 1971లో తన దేశంలో తూర్పు భాగాన జరిగిన ఇండిపెండెన్స్​ ఉద్యమాన్ని పాకిస్థాన్​… ఇండియాపై యుద్ధంగా మార్చింది.  ఇండియా, పాకిస్తాన్ మధ్య 1971లో అతి పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఫలితంగానే ప్రపంచ రాజకీయ పటంపై బంగ్లాదేశ్​ అనే కొత్త దేశం పుట్టింది. తూర్పు పాకిస్థాన్ విమోచన యుద్దంగా కూడా దీనిని పేర్కొంటారు.  ఇండియా నుంచి విడిపోయినప్పటికీ పాకిస్థాన్​ అఖండ దేశంగా ఏర్పడలేదు. ఇండియాకి పడమర వైపున పాకిస్థాన్​, పశ్చిమ బెంగాల్​ను ఆనుకుని తూర్పు పాకిస్థాన్​ ఏర్పడ్డాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ వేర్వేరు భాషలుండేవి.  పాకిస్థాన్​ అధికార భాషయిన ఉర్దూను తూర్పు భూభాగంలోని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో బెంగాలీ ఎక్కువగా మాట్లాడతారు, దాంతో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ మధ్య గొడవలు ముదిరాయి. దీనికి తోడు  1970లో జరిగిన పాకిస్థాన్​ పార్లమెంట్​ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ తూర్పు పాకిస్థాన్​లోని మొత్తం 169 సీట్లలో 167 సీట్లు గెలుచుకుంది. దీంతో  ప్రభుత్వ ఏర్పాటుకు అవామీ లీగ్ నాయకుడు షేక్ ముజీబుర్ రహ్మాన్ ముందుకొచ్చారు. రాష్ట్రపతి యాహ్యా ఖాన్ నిరాకరించడంతో రెండు ప్రాంతాల మధ్య గొడవలు మొదలయ్యాయి. తూర్పు ప్రాంతానికి  యాహ్యా ఖాన్ సైన్యాన్ని రంగంలోకి దింపాడు.  దీనికి నిరసనగా తూర్పు పాకిస్థాన్ లో పెద్ద ఎత్తున ఉద్యమం జురిగింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే పాకిస్థాన్​ సైన్యం 1971 మార్చి 25న ఢాకా నగరాన్ని స్వాధీనపరచుకుంది.  దీంతో తూర్పు పాకిస్థాన్​కి చెందిన చాలా మంది నాయకులు, ప్రజలు శరణార్థులుగా ఇండియాకి వచ్చారు. షేక్ ముజీబుర్ రహ్మాన్​ను పాకిస్థాన్​ సైన్యం అరెస్టు చేసి పశ్చిమ ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు పాకిస్థాన్​ సైన్యంలో మేజర్ హోదాలో ఉన్న జియా ఉర్ రహ్మాన్ బంగ్లాదేశ్​ని స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. అవామీ లీగ్ నాయకులు కొందరు దేశం వెలుపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు పాకిస్థానీయులు గెరిల్లా గ్రూపులుగా మారి, పాకిస్థాన్​ సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 1971 మార్చి 27న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి మద్దతు పలికారు. బంగ్లా శరణార్థులకు అండగా నిలిచారు. దీంతో దాదాపు కోటి మంది శరణార్థులు మనదేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు.

 లోంగో వాలా విజయం

1971 నాటి యుద్ధంలో లోంగోవాలా విజయాన్ని  ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇండియన్​ ఎయిర్ ఫోర్స్ విమానాలు పాకిస్థాన్​ సైన్యంపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ యుద్ధంలో దీనినే తొలి విజయంగా చరిత్రకారులు పేర్కొంటారు.

యుద్దం తర్వాతి పరిణామాలు

ఈ యుద్దం తర్వాత అప్పటివరకు ‘తూర్పు పాకిస్థాన్’గా ఉన్న ప్రాంతం ‘బంగ్లాదేశ్’ అనే స్వతంత్ర దేశంగా  అవతరించింది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ రాజీనామా చేశాడు. ముజీబుర్ రహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. యుద్ధంలో తాను గెలుచుకున్న పాక్​ భూభాగాన్ని 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్​కు ఇండియా తిరిగి ఇచ్చేసింది. ఈ ఒప్పందంపై ఇండియా ప్రధాని ఇందిరా గాంధీ, పాక్​ ప్రధాని జుల్ఫికర్​ అలీ భుట్టో సంతకాలు చేశారు.

13 రోజుల్లో ఫినిష్​

1971 డిసెంబర్ మూడో తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్​కు చెందిన 11 స్థావరాలపై పాక్​ దాడి చేయడంతో యుద్ధం మొదలైంది. 13 రోజుల తర్వాత తూర్పు కమాండ్​కి చెందిన పాక్​ బలగాలు లొంగుబాటు పత్రంపై  సంతకాలు చేయడంతో యుద్దం ముగిసింది. 1971 నాటి యుద్ధం తర్వాత ప్రధాని ఇందిర పాపులారిటీ పెరిగింది. మనదేశ రాజకీయాల్లో  చాలా ఏళ్ల పాటు ఇందిర ఆధిక్యత కొనసాగడానికి బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ఒక కారణమైంది.

మొదటి యుద్ధం–1965

కాశ్మీర్​ను కాపాడుకునేందుకు…

పాక్​ ప్రెసిడెంట్​ అయూబ్​ఖాన్​ ఓ సందర్భంలో ‘ఇండియా పీఎం పొట్టోడు. ఉఫ్​ అంటే ఎగిరిపోతాడు’ అంటూ ఈసడించాడు. ఇది అప్పటి ప్రధాని లాల్​ బహదూర్​ శాస్త్రి దృష్టికి వచ్చింది. ‘ఆయన తిట్లకు మనం తూటాలతో బదులిద్దాం (ఉన్​ గాలియోం కా జవాబు హమ్​ గోలీయోం సే దేయేంగే)’ అన్నారు.  జై జవాన్​–జై కిసాన్​ స్లోగన్​తో దేశాన్ని ఏకం చేశారు. 1965లో జరిగిన యుద్ధంలో తానేమిటో రుజువు చేశారు శాస్త్రి.  కేవలం 17 రోజుల్లో తిప్పికొట్టారు.

‘ఆపరేషన్ జిబ్రాల్టర్’కు కొనసాగింపుగా ఇండియాపై  యుద్ధం చేసింది. జమ్మూ కాశ్మీర్​లో కల్లోలం సృష్టించడానికి, ఇండియా పట్ల వ్యతిరేకతను పెంచడానికి పాకిస్థాన్​ మిలిటరీ పెట్టుకున్న కోడ్ నేమ్​ ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’. ఇందులో భాగంగా సరిహద్దులను దాటుకుని పాకిస్థాన్​ సైనికులు జమ్మూ కాశ్మీర్​లోకి ప్రవేశించారు. 17 రోజుల పాటు ఏకధాటిగా జరిగిన యుద్దంలో రెండు వైపులా వేలాది మంది సైనికులు చనిపోయారు.

రాన్​ ఆఫ్ కచ్ ప్రాంతమే నేపథ్యం

స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సరిహద్దు తగాదాలు ఉండేవి. గుజరాత్ రాష్ట్రంలోని రాన్​ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్థాన్​ కవ్వింపులకు దిగడంతో… 1965 మార్చి, ఏప్రిల్ నెలల్లో ఘర్షణలు జరిగాయి.  పీఓకేలోని హాజీ పీర్ పాస్ వరకు ఇండియన్​ ఆర్మీ చొచ్చుకెళ్లిపోయింది.  మన సైన్యాన్ని దెబ్బతీయడానికి ‘ఆపరేషన్ గ్రాండ్ స్లామ్’ పేరుతో పాకిస్థాన్​ దాడికి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగి పాకిస్థాన్​ సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది.  దీంతో ఆపరేషన్ గ్రాండ్ స్లామ్  ఫెయిలైంది.

తాష్కెంట్ ​డిక్లరేషన్

అప్పటి సోవియట్ యూనియన్, అమెరికా చొరవతో రెండు దేశాల మధ్య  కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో యుద్దం ముగిసింది. సోవియట్​ రష్యాలోని తాష్కెంట్ (ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్​ కేపిటల్​)​లో ఇండియా ప్రధాని లాల్​ బహదూర్​ శాస్త్రి, పాక్​ ప్రెసిడెంట్​ అయూబ్​ ఖాన్​ల మధ్య ఈ ఒప్పందం జరిగింది. తాష్కెంట్ డిక్లరేషన్​ ప్రకటించిన రోజు రాత్రే లాల్​ బహదూర్​ కన్నుమూశారు.

మూడో యుద్ధం–1999

పాక్​ సైన్యాన్ని తరిమేయడానికి…

కార్గిల్ యుద్ధం సరిగ్గా 20 ఏళ్ల కిందట జరిగింది. 1999 మే 3న పాకిస్థాన్​ సైనికులు సరిహద్దులు దాటి కార్గిల్​ ఏరియా నుంచి ఇండియాలోకి అడుగుపెట్టారు. అనేక కారణాల వల్ల మన సైన్యం మొదట్లో ఈ చొరబాట్లను గుర్తించలేదు.  గస్తీ దళంపై పాక్ సైనికులు జరిపిన దాడులతో చొరబాటుదారుల సంగతి బయటపడింది. మొదట్లో వీరిని  టెర్రరిస్టులుగా ఇండియన్ ఆర్మీ భావించింది. తర్వాత వారు దాడులు చేస్తున్న తీరు చూసి సైనికులేనన్న నిర్థారణకు వచ్చింది. దీంతో పాకిస్థాన్​ సైనికులను  తరిమికొట్టడానికి ‘ఆపరేషన్ విజయ్’ మొదలెట్టింది. దాదాపు మూడు నెలల పాటు యుద్ధం జరిగాక ఇండియన్​ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్​ లొంగిపోయింది. కార్గిల్​ మంచు కొండల నుంచి పాకిస్థాన్​ సైన్యాన్ని పూర్తిగా మన ఆర్మీ తరిమికొట్టింది.

అత్యంత ఎత్తయిన ప్రాంతంలో జరిగిన యుద్ధం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో జరిగింది కార్గిల్ యుద్ధం. పాకిస్థాన్​ సైనికులు కొండ మీద,  మన సైనికులు దిగువన ఉన్నారు. ఎత్తులో ఉండటంవల్ల శత్రువులకు అనుకూలంగా మారింది. కొండ దిగువన ఉండటం మన సైనికులకు మైనస్ పాయింట్ అయ్యింది. అయినా ప్రాణాలకు తెగించి ఇండియన్ ఆర్మీ పోరాడింది. కింద నుంచి పైకి ఎగబాకి శత్రు సైన్యంతో మనవాళ్లు తలపడ్డారు. యుద్దం ముగిసేనాటికి టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా కొండకోనలపై ఉన్న ఒక్కో స్థావరం నుంచి పాకిస్థాన్​ సైనికులను తరిమికొట్టారు.

కార్గిల్ యుద్ద నేపథ్యం

1998–1999 మధ్య కాలంలో పాకిస్థాన్​ మిలిటరీ కొంతమంది సైనికులను ముజాహిదీన్​ల రూపంలో కాశ్మీర్​లోకి పంపింది. ‘ఆపరేషన్ బద్ర్’ అని దీనికో పేరుకూడా పెట్టింది. కాశ్మీర్, లఢఖ్ మధ్య లింక్ తెగ్గొట్టి, సియాచిన్ పర్వత ప్రాంతాల నుంచి ఇండియన్ ఆర్మీని పంపేయాలన్నది  పాకిస్థాన్ ప్లాన్. అయితే యుద్ధం అంటూ జరిగితే నష్టపోతామన్న భయంతో పాకిస్థాన్​ నాయకులు ఈ ప్లాన్ నుంచి వెనక్కి తగ్గారు. పర్వేజ్ ముషారఫ్ తాను పాకిస్థాన్​ జనరల్​ కాగానే ఈ కుట్రను మళ్లీ బయటకు తీశాడు.

మూడు దశలుగా యుద్ధం

కార్గిల్ యుద్ధాన్ని మూడు దశలుగా  చెప్పుకోవచ్చు. తొలి దశలో పాకిస్థాన్ సైనికులు కాశ్మీర్ లోకి చొరబడి, కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. రెండో దశలో చొరబాట్లను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. మూడో దశలో పాకిస్థాన్ సైనికుల మీద పోరాటం చేసి వారిని మన భూభాగం నుంచి తరిమికొట్టింది.

1999 మే 3న కార్గిల్ ప్రాంతంలోకి  పాకిస్తాన్ సైనికులు చొరబడ్డట్టు అక్కడి గొర్రెల కాపరులు చెప్పారు. దీంతో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ మే 5న గస్తీ దళాన్ని అక్కడకు పంపించింది. గస్తీ దళానికి చెందిన ఐదుగురు ఇండియన్ సైనికులను శత్రువులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. దీంతో కాశ్మీర్ లోయ నుంచి పెద్ద ఎత్తున సైనికులను కార్గిల్ సెక్టార్ కు పంపించింది. మే 26న చొరబాటుదారులపై  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. జూన్ 6న మన సైనికులు పెద్ద ఎత్తున దాడి చేశారు. జూన్ 9న బటాలిక్ సెక్టార్ లో రెండు కీలక స్థావరాలను ఇండియన్ ఆర్మీ  స్వాధీనపరచుకుంది.

మొదట్నుంచీ పన్నాగాలే!

ఇండిపెండెన్స్​ సంబురాలు ఒకపక్క జరుగుతుండగానే కాశ్మీర్​లో చొరబడాలని పాకిస్థాన్​ పన్నాగం పన్నింది. అప్పటికి కాశ్మీర్​ రాజ్యం ఇండియన్​ యూనియన్​లో కలవలేదు. 1947 అక్టోబరులో సరిహద్దుల్లోని ట్రైబల్స్​ని రెచ్చగొట్టింది. కొంతకాలం గడిచాక బారాముల్లా దిశగా శ్రీనగర్​లో ప్రవేశించడానికి పాకిస్థాన్​ ఆర్మీ ప్రయత్నించింది. ఆ సైన్యంతో జమ్మూ కాశ్మీర్​ బలగాలు తలపడ్డాయి. పాకిస్థాన్​ సైన్యం ముందు నిలబడే పరిస్థితి లేకపోయేసరికి, కాశ్మీర్​ మహరాజా హరిసింగ్​కి ఎటూ పాలుపోలేదు. చివరి నిమిషంలో ఇండియాలో కలవడానికి సిద్ధపడ్డాడు. దీంతో అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్​ వల్లభాయ్​ పటేల్ ఆదేశాలతో మన ఎయిర్​ఫోర్స్​ రంగంలో దిగి, పాకిస్థాన్​ బలగాల్ని తిప్పికొట్టింది. ​

కార్గిల్ విజయ్ దివస్

కార్గిల్ యుద్దంలో గెలిచిన సందర్భంగా ప్రతి ఏడాది జులై 26న ‘ కార్గిల్ విజయ్ దివస్ ’ ను జరుపుకుంటాం. యుద్ధంలో అమరులైన 500 మంది సైనికులను తలచుకుంటాం. వారి త్యాగాలను స్మరించుకుంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించుకుంటాం.