బోరు బావిలో పడిన మరో చిన్నారి కథ విషాదంగా ముగిసింది. మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన మూడేళ్ల సాయివర్థన్ చనిపోయాడు. జిల్లాలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో ఘటన జరిగింది. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు పోలీస్, రెవిన్యూ, హెల్త్, ఫైర్ సర్వీస్ డిపార్ట్ మెంట్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 12 గంటల రెస్క్యూ తర్వాత 17 అడుగుల లోతు నుంచి బాబు డెడ్ బాడీని బయటకు తీశారు. రెండు జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాబును కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. హైదరాబాద్ నుంచి ఓ టీమ్, ఏపీ గుంటూరు జిల్లా నుంచి మరో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సహాయక చర్యల్లో పాల్గొంది. రోబోటిక్ బోర్ వెల్ మిషనరీతో రెస్క్యూ చేశారు. బండరాళ్లు అడ్డురావడం, బాబుపై మట్టి పెళ్లలు పడడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలిగిందని చెప్పారు అధికారులు.
బుధవారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగింది. వ్యవసాయ భూమిలో అప్పుడే తీసిన బోరు బావిలో పడిపోయాడు చిన్నారి. పక్కనే ఉన్న తల్లిదండ్రులు వెంటనే బాబును బయటకు తీసేందుకు యత్నించారు. 4, 5 గంటల వరకు బోరు బావి నుంచి డాడీ , డాడీ అంటూ ఏడ్చాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ తర్వాత బోరు బావి నుంచి ఎలాంటి చప్పుడు రాలేదని అన్నారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సహాయ చర్యలను పర్యవేక్షించారు.
బాలుడి స్వస్థలం సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు కాగా.. పొడ్చన్ పల్లిలో తాత ఇంటికి వెళ్లారు. తాత భిక్షపతి.. తన పొలంలో పంట సాగుకోసం 3 బోర్లు వేయించాడు. మంగళవారం రాత్రి ఒక బోరు వేయగా అది ఫెయిల్ అయ్యింది. తర్వాత రోజు బుధవారం పొలంలో మరో రెండు బోర్లు వేయించాడు. అయితే అవి కూడా ఫెయిల్ అయ్యాయి. బోరువేసే టైమ్ లో పొలం దగ్గరకు భిక్షపతితో పాటు అతని కూతురు నవీన, అల్లుడు గోవర్థన్, ముగ్గురు మనవళ్లు వచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత అందరూ ఇంటికి బయల్దేరుతుండగా… చిన్నారి సాయి వర్థన్ బోరు బావిలో పడిపోయాడు. బోరు తవ్విన టైమ్ లో బయటకొచ్చిన మట్టి కుప్ప మీదకు ఎక్కడంతో జారి గుంటలోకి పడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.