
నిజామాబాద్, వెలుగు: భిక్షాటన చేసే మహిళ కూతురు కిడ్నాప్అయిన ఘటన నిజామాబాద్ సిటీలో జరిగింది. చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక పోలీస్టీమ్ లు గాలింపు చేపట్టాయి. వివరాల్లోకి వెళ్తే.. సిటీ శివారులోని నాగారం ఏరియాకు చెందిన శిరీష యాచకురాలు. తన కూతురు రమ్య(3)ను వెంటబెట్టుకుని ఆదివారం రోజంతా భిక్షాటన చేసింది. రాత్రి గాంధీ చౌక్‌లో ఒక షాప్ఎదుట ఆమె తన బిడ్డతో కలిసి నిద్రపోయింది. అర్ధరాత్రి లేచి చూడగా చిన్నారి కనిపించలేదు.
దీంతో వెంటనే వన్‌టౌన్‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రఘుపతి సిబ్బందితో వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. ఓ యువకుడు బాలికను ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రైల్వే స్టేషన్‌వరకు వెళ్లిన దుండగుడు ఆ తర్వాత పాపతో ఎక్కడికి వెళ్లాడనే జాడ తెలియలేదు. స్పెషల్‌పార్టీ పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.