- హైవే పై ఎక్కువ మలుపులు
- మరోవైపు ప్రమాదాలకు కారణం అవుతున్న డ్రైవర్ల నిర్లక్ష్యం
- రోడ్డు ఎక్కితే చాలు భయం భయం
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో వెహికల్స్‌తో రోడ్లమీదకి ఎక్కితే.. క్షేమంగా తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఎటు వైపు నుంచి ఏ వెహికల్ వచ్చి ఢీకొంటుందో అన్న భయం వెంటాడుతోంది. ముఖ్యంగా జిల్లాలోని ఎన్‌హెచ్ 65 పై జర్నీ అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి అజాగ్రత్తలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆతివేగం, రాంగ్‌రూట్‌ప్రయాణాలతో జిల్లా నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా -హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవే 65 పై ప్రయాణం చేయడానికి జనం భయపడుతున్నారు.
ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు..
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అంజనాపూరి కాలనీ, ఈనాడు ఆఫీస్, జనగాం క్రాస్ రోడ్, దురాజ్ పల్లి చౌరస్తా వద్ద హైదరాబాదు- విజయవాడ జాతీయ రహదారిని దాటే క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.
- వారంరోజుల్లోనే దాదాపు 15 మంది సూర్యాపేట జాతీయ రహదారి పై వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.
- సూర్యాపేట మున్సిపాలిటీ పరిధి దాదాపు 8కిలోమీటర్ల మేర ఉండడంతో అండర్‌పాస్, సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
- ఇటీవల ఖమ్మం జాతీయ రహదారి పూర్తికాగా ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ సూర్యాపేట రాయిని గూడెం వద్ద యూ టర్న్ తీసుకోవాల్సి వస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికిల్స్ వేగంగా వస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- జాతీయ రహదారిపై వాహనాల వేగం ఎక్కువగా ఉండటంతో రోడ్డుదాటే క్రమంలో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
- 24 గంటల పాటు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ప్రమాదాల నివారణలకు ఎలాంటి చర్యలు కనబడటం లేదు.
- రోడ్డు మలుపులు ఉండటంతో వాహనాలు అదుపుతప్పుతున్నాయి.
- మునగాల మండలం ముకుందాపురం, సూర్యాపేట మండలం టేకుమట్ల, చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీలు ప్రమాదాలకు కేంద్రాలుగా మారాయి.
- స్టేజీల వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
- జాతీయ రహదారిపై ఎక్కడా కూడా సూచికలు, స్పీడ్‌బ్రేకర్లు కనిపించక ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలను వీధిపాలు చేస్తున్నాయి.
నిబంధనలు గాలికి..
చాలా మంది వాహనదారులు రహదారి నిబంధనలు పాటించడం లేదు. హైవేపై వాహనాలు నిలపడం, మద్యం తాగి డ్రైవింగ్‌చేయడం, రాంగ్‌రూట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. మైనర్లు వాహనాలు నడపడం, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం వల్ల నష్టం కలుగుతోంది. రవాణ శాఖాధికారులు తనిఖీలు నామమాత్రంగా చేపట్టడంతోనే వాహనదారులు నిబంధనలను పాటించడం లేదనే ప్రచారం ఉంది. పోలీసు శాఖ అధికారులు తనిఖీలు చేపట్టినా నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారే తప్పా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
13 రోజుల్లో 22 మంది మృతి
ఈ నెల 4న సూర్యాపేట మానస నగర్ వద్ద అర్వపల్లి నుండి సూర్యాపేటకు 17మందితో వస్తున్న ఆటోను ఎర్టీగా కారు వేగంగా వచ్చి వెనుక నుంచి , లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందగా మరో ముగ్గురు ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. ఈ నెల 11న కేతేపల్లి కి చెందిన ఏడుగురు స్టూడెంట్స్ ఆత్మకూర్( ఎస్) మండలం నెమ్మికల్ దండు మైసమ్మ దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా రాయినిగూడెం వద్ద స్కూటీని తప్పించబోయి చెట్టుకు ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు స్టూడెంట్స్ స్పాట్ లోనే మృతి చెందారు. అదే రోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై లారీ వెనుక నుండి కారు డీకొట్టడంతో సూర్యాపేటకు చెందిన ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు.