మహదేవ్​పూర్​ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో..30 బెడ్లు..ఒక్కరే డాక్టర్

మహదేవ్​పూర్​ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో..30 బెడ్లు..ఒక్కరే డాక్టర్
  • మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ సీహెచ్​సీలో గతంలో వందల సంఖ్యలో డెలివరీలు
  • నేడు నెలకు 10 కూడా దాటని వైనం
  • ఖాళీగా గైనకాలజిస్ట్‌‌‌‌ పోస్టులు, ప్రైవేటుకు వెళ్తున్న పేషెంట్లు

జయశంకర్‌‌‌‌‌‌ భూపాలపల్లి/ మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు : జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్​ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో ఒక్కరే డాక్టర్​ ఉండడంతో రోగులకు వైద్యం అందని పరిస్థితి ఉంది. 30 పడకలు ఉన్నా కనీస వైద్య సేవలు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఒకప్పుడు వందల సంఖ్యలో డెలివరీలు జరిగిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం కనీసం పది కూడా జరగట్లేదు. అనస్తీషియా డాక్టర్‌‌‌‌, గైనకాలజిస్ట్‌‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో నార్మల్‌‌‌‌ డెలివరీలను మాత్రమే చేస్తున్నారు.

దీంతో పేద కుటుంబాల వాళ్లు రూ.లక్షలు ఖర్చుచేసి ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాల్సి వస్తోంది. మహదేవపూర్‌‌‌‌ లోని ఆసుపత్రికి మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాలతో పాటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచ, ఆహేరి ప్రాంత వాసులకు వైద్యసేవలు అందించడంలో పెద్ద దిక్కుగా ఉంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో రోజుకు 100కు పైగా రోగులు ఆసుపత్రికి వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు. 

పోస్టులన్నీ ఖాళీ..

ఒకప్పుడు ఈ హాస్పిటల్‌‌‌‌లో నెలకు వందకు పైగా ప్రసవాలు చేసేవాళ్లు. ఇప్పుడు మాత్రం నెలకు పది లోపే నార్మల్‌‌‌‌ డెలివరీలు చేస్తున్నారు. ఇద్దరు గైనకాలజిస్ట్‌‌‌‌, అనస్తీషియా, జనరల్  మెడిసిన్, ఫోరెన్సిక్  మెడిసిన్, పీడియాట్రిక్‌‌‌‌ డాక్టర్‌‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మూడు స్టాఫ్‌‌‌‌ నర్స్‌‌‌‌, పీడియాట్రిక్స్ 2, స్టాఫ్ నర్స్ పోస్టులు, ఫోర్త్  క్లాస్ ఎంప్లాయీస్ , ఏఎన్‌‌‌‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

డెలివరీ కోసం భూపాలపల్లికి..

మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ సీహెచ్‌‌‌‌సీ‌‌లో స్త్రీల వైద్య నిపుణులు, పిల్లలు, మత్తు (అనస్తీషియా) డాక్టర్లు లేక ప్రసవాలు, శస్త్ర చికిత్సలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. డెలివరీ అయితే పిల్లలకు పరీక్షలు చేయడానికి పిల్లల డాక్టర్లు లేరు. దీంతో ఆశా వర్కర్లు గర్భిణులను డెలివరీ కోసం భూపాలపల్లి ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. కొంత మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇక డిప్యూటేషన్‌‌‌‌పై పని చేస్తున్న డాక్టర్లు సైతం వంతుల వారీగా వస్తుండడంతో మారుమూల ప్రాంతంలో వైద్యసేవలు అందడం లేదు. 

హాస్పిటల్‌‌‌‌లో అన్నీ సమస్యలే..

హాస్పిటల్‌‌‌‌లో ఈసీజీ, ఎక్స్​రే, డిజిటల్  ఎక్స్​రే, మొబైల్  ఎక్స్​రే, యూరిన్  కల్చర్, బ్లడ్  కల్చర్  యూనిట్ లు ఉన్నా వాడకపోవడంతో నిరుపయోగంగా మారాయి. డ్రైనేజీ సిస్టం చెడిపోవడంతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. నార్మల్‌‌‌‌ డెలివరీ అయిన వారు మరుగుదొడ్లకు నడుచుకుంటూ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక బాలింతల గదుల వద్ద దుర్వాసన వెదజల్లుతోంది. కాంపౌండ్  లేకపోవడంతో కుక్కలు, పందులు పరిసరాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి.

ఆక్సిజన్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌, బర్త్  వెయిటింగ్  గది, బ్లడ్  స్టోరేజీ సెంటర్లు ప్రారంభించాల్సి ఉంది. ఫైర్  సిలిండర్లు ఉన్నా అత్యవసర సమయాల్లో ఎలా వాడాలనేది సిబ్బందికి అవగాహన లేదు. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్లు లేవు. డయాలసిస్, హెచ్ఐవీ మందులు అందుబాటులో లేవని పేషెంట్లు చెబుతున్నారు. హాస్పిటల్  చుట్టూ మురికి గుంటలు ఏర్పడి, నీళ్లు నిలిచి ఇబ్బందిగా తయారైంది.

ప్రైవేట్​ హాస్పిటల్​కు వెళ్లాం..

మహదేవపూర్ లో  డాక్టర్లు లేకపోవడంతో నా భార్యను డెలివరీ కోసం భూపాల్ పల్లిలోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్ కి తీసుకువెళ్లాను. రూ.60 వేలు ఖర్చు వచ్చింది. డాక్టర్లు లేకపోవడంతో 100 కిలోమీటర్ల దూరంలోని భూపాలపల్లికి వెళ్లాల్సి వస్తోంది. మహదేవపూర్  హాస్పిటల్ లో డాక్టర్లను నియమించి, సౌలతులు కల్పించాలి.

‒గుండ్లపల్లి రవి, పలిమెల

ఇబ్బంది రాకుండా చూస్తున్నాం..

మహదేవపూర్  సీహెచ్​సీలో ప్రతిరోజు 200 వరకు ఔట్ పేషెంట్లు వస్తారు. గైనకాలజిస్ట్​ లేకపోవడంతో డెలివరీలు చేయలేకపోతున్నాం. హాస్పిటల్‌‌‌‌ లో టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది. కాంపౌండ్ వాల్  లేకపోవడంతో పందులు , కుక్కలు వస్తున్నాయి. సరిపడా స్టాఫ్  లేకున్నా పేషెంట్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం.

‒ డాక్టర్  చంద్రశేఖర్, సూపరింటెండెంట్