- త్వరలోనే వారిపై అనర్హత వేటు పడ్తది: రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్, హరీశ్‌రావు కూడా జైలుకు పోవుడు ఖాయం
- రేవంత్ రెడ్డికి.. కోమటిరెడ్డి బ్రదర్స్తోడైతే బీఆర్ఎస్లో ఒక్కరూ మిగలరని వెల్లడి
జనగామ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్కేసులో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగంతో వారంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసి, పోలీసుల వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లి పంచి గెలిచిన విషయం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వారందరిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ కేసులో కేసీఆర్, హరీశ్‌రావు కూడా జైలుకు పోవుడు ఖాయమని చెప్పారు.
శనివారం జనగామలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆర్అండ్బీ గెస్ట్హౌజ్నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. దీనికి పీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్, ఎమ్మెల్సీమహేశ్కుమార్ గౌడ్‌తో కలిసి రాజగోపాల్‌రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ను బతికి బట్టకట్టనిచ్చేదే లేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేండ్ల పాటు కేసీఆర్ దోచుకుతిన్నదంతా కక్కిస్తాన్నారు. కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలని, ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేస్తామని హెచ్చరించారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే బిడ్డ కవిత తీహార్ జైల్లో ఉందని, పదేండ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్తోడైతే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరని అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డినే భారీ మెజారిటీతో గెలిపించాలని ముప్పై మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగానే.. జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఎమ్మెల్యే అవుతారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
కేంద్రంలో ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ ప్రధాని అవడం ఖాయమన్నారు. మోదీకి మళ్లీ ఓటెయ్యొద్దని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్కొమ్మూరి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండేందుకు జనం చేతి గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ఎంపీ అభ్యర్థి చామల మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే జనగామను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. జనగామలో దొంగ ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరారు.