- అధికారుల కళ్లుగప్పి ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
- 10 మందిని అరెస్ట్‌చేసిన వరంగల్పోలీసులు
- పరారీలో మరో నలుగురు నిందితులు
వరంగల్, వెలుగు: మూడేండ్లుగా ఫేక్‌వే బిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ ఇసుక దందా చేస్తున్న ముఠాను వరంగల్పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఇసుక కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియను టీఎస్‍ఎండీసీ(తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్) చూస్తోంది. ఇసుక బిజినెస్ చేసేవారు దీని నుంచి పర్మిషన్తీసుకోవాల్సి ఉంటుంది. రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలంటే 12 టైర్లు, 14 టైర్లు, 16 టైర్లు ఇలా లారీ సైజును బట్టి ఒక్కో రేటు ఉంటుంది. వ్యాపారులు 12 టైర్ల లారీలో 26 టన్నుల ఇసుకకు రూ.10,238, 14 టైర్ల లారీలో 32 టన్నులకు రూ.13,085, 16 టైర్ల లారీలో 35 టన్నులకు రూ.14,800 చొప్పున డీడీ కట్టి లారీ వివరాలు పొందుపరచాలి. ఆపై టీఎస్‍ఎండీసీ ఇచ్చే ‘వే బిల్’ చూపిస్తే రీచ్‌లో ఇసుక లోడ్ చేస్తారు.చెక్ పోస్టుల వద్ద లారీ డ్రైవర్లు వే బిల్లులు చూపించి స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దళారులు, లారీ డ్రైవర్లు, వ్యాపారులు ఓ ముఠా ఏర్పడి ఏకంగా టీఎస్‍ఎండీసీ పేరుతో ఫేక్ వే బిల్లులు తయారు చేయడం మొదలుపెట్టారు. వాటితో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ రూ.30 కోట్లు మింగేశారు. సోమవారం వరంగల్కమిషనరేట్లో ఏవీ రంగనాథ్ప్రెస్మీట్పెట్టి ముఠా వివరాలు వెల్లడించారు.
1,700 ఫేక్‌వే బిల్లులతో..
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయపూర్ మండలం పుట్టపాకకు చెందిన ఎదుల కిరణ్‍కుమార్(ఫోక్ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు) మూడేండ్లుగా ఫేక్ వే బిల్లులు తయారు చేస్తున్నాడు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్‍కు చెందిన లారీ ఓనర్ షేక్ ఇమ్రాన్, హైదరాబాద్ ఉప్పల్ భరత్‍నగర్‍కు చెందిన లారీ డ్రైవర్ గంట ప్రదీప్‍రెడ్డి, ములుగు జిల్లా ఏటూరునాగారం చిన్నబోయినపల్లికి చెందిన రాజశేఖర్ గౌడ్ దళాలురులుగా వ్యవహరిస్తూ ఫేక్‌వే బిల్లులు విక్రయిస్తున్నారు. సందీప్ రెడ్డి, రాజగోపాల్ గౌడ్, చరణ్ గౌడ్, రాకేశ్ అనే లారీ డ్రైవర్లు వాటిని తీసుకుని వాడుకోవడమే కాకుండా ఇతర లారీ డ్రైవర్లకు ఇప్పించేవారు. ఇలా వరంగల్, కరీంనగర్, నల్గొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్రమంగా దాదాపు రూ.30కోట్ల ఇసుక దందా చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌పోలీసులు రంగంలోకి దిగి 10 మందిని అరెస్ట్‌చేశారు. దర్యాప్తులో కిరణ్ కుమార్ 1,700 ఫేక్‌వే బిల్లులు తయారుచేసినట్లు, మరికొన్ని సిస్టమ్ నుంచి డిలీట్చేసినట్లు గుర్తించారు.
వేర్వేరు పీఎస్‌లలో కేసులు
అక్రమ ఇసుక రవాణా ముఠాపై కాకతీయ యూనివర్సిటీ, మట్వాడా, ధర్మసాగర్ పీఎస్ ల పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. మంచిళ్ల వెంకటేశ్, పర్లపల్లి శ్రీకాంత్, గంట ప్రదీప్‍రెడ్డి, రాజశేఖర్‍గౌడ్, ఎదుల కిరణ్ కుమార్, షేక్ ఇమ్రాన్, బండమీది స్వామి, ఆరుట్ల రాజు, బూడిద శివ, జోగు సైదులు అనే 10 మందిని అరెస్ట్‌చేసి 16 లారీలు, 65 ఫేక్ వే బిల్లులు, 16 ఫేక్టీఎస్ఎండీసీ రబ్బరు స్టాంపులు, లాప్‍ట్యాప్, 11 సెల్‍ఫోన్లు, రూ.41 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. చరణ్ గౌడ్, యెన్నమల్ల రాకేశ్, ముత్యాల రామన్న, బచనగోని యాదగిరి పరారీలో ఉన్నట్లు చెప్పారు. దర్యాప్తు పూర్తవడానికి వారం పది రోజులు పడుతుందన్నారు. ఇసుక దందా ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, ఎస్సైలు శంకర్, ఫిలిప్ రాజు, విజయ్, లవణ్‍కుమార్, నిస్సార్ పాషా, ఇతర సిబ్బందిని సీపీ రంగనాథ్ అభినందించారు.