
- గొర్రెలు, బర్రెలు అమ్మి..అప్పులు చేసి ఆరు ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు
- నేటికీ నిర్మాణ దశలోనే 18 ఇండ్లు
- ఆరు ఇండ్ల నిర్మాణం మొదలే కాలె
- ఇండ్ల పురోగతిపై రిపోర్టు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం
- గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించిన ఆసిఫాబాద్ కలెక్టర్
ఆసిఫాబాద్, వెలుగు: జోడేఘాట్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ఇండ్లపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆసిఫాబాద్జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడేతో చర్చించారు. గ్రామానికి వెళ్లి ఇండ్ల పురోగతిని పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఆ వెంటనే కలెక్టర్గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా, 2020లో గత ప్రభుత్వం కెరమెరి మండలం జోడేఘాట్లోని కుమ్రం భీం వారసులు, ఆదివాసీల కోసం 30 డబుల్ బెడ్రూమ్ఇండ్లు మంజూరు చేసింది. ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన అప్పటి బీఆర్ఎస్నేతలు తర్వాత పట్టించుకోలేదు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అతి కష్టం మీద, అప్పులు తెచ్చుకుని లబ్ధిదారులే ఆరు ఇండ్లను పూర్తిచేసుకున్నారు. మిగిలిన 24 ఇండ్లలో కొన్ని బేస్ మెట్, మరికొన్ని పిల్లర్ల లెవల్ లోనే ఉన్నాయి. పైసలు లేక ఆరుగురు లబ్ధిదారులు ఇండ్ల పనులు నేటికీ మొదలుపెట్టలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇండ్లపై ఆశలు వదిలేసుకున్నామని గురువారం గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఎదుట లబ్ధిదారులు వాపోయారు.
2014 నాటి హామీ.. కేసీఆర్ నెరవేర్చలే
2014లో జోడేఘాట్లో జరిగిన కుమ్రంభీం వర్థంతి కార్యక్రమంలో అప్పటి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సరైన ఇండ్లు లేక పాకల్లో ఉంటున్న ఆదివాసీలు, కుమ్రంభీం వారసులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత పట్టించుకోలేదు. రెండేళ్ల తర్వాత 2016లో కుమ్రంభీం వర్థంతికి హాజరైన అప్పటి మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీని నెరవేరుస్తామని చెప్పారు. ఆయన కూడా తర్వాత పట్టించుకోలేదు. చివరికి 2020లో జోడేఘాట్గ్రామంలో మొత్తం 50 ఆదివాసీ కుటుంబాలు ఉండగా, 30 డబుల్బెడ్రూమ్ఇండ్లు మంజూరు చేసింది. 2020లో జరిగిన కుమ్రం భీం 80వ కుమ్రంభీం వర్థంతి సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అప్పటి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఐటీడీఏ పీఓ భవేశ్ మిశ్రా జోడేఘాట్ లో 30 ఇండ్లకు శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడుస్తున్నా ఇండ్లు పూర్తికాలేదు. భీం వారసులు సహా అక్కడి ఆదివాసీలు పూరి గుడిసెల్లోనే బతుకుతున్నారు. మధ్యలో ఆగిపోయిన పనులను కంప్లీట్చేసేందుకు ఆరుగురు లబ్ధిదారులు తమ మేకలు, ఆవులు, బర్రెలను అమ్ముకున్నారు. అవి చాలక అప్పులు చేసి మరీ నిర్మాణ పనులు పూర్తిచేసుకున్నారు. పనులు చేసుకున్నవారికి ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పిస్తామని చెప్పి పట్టించుకోలేదు.
ఊరించి.. ఉసూరుమనిపించి..
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇండ్లు కట్టించి, గృహప్రవేశం రోజున లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకుంటామని చెప్పిన బీఆర్ఎస్ నేతల మాటలు నీటి మూటలయ్యాయి. ఏండ్లుగా ఊరించి ఉసూరుమనిపించారని జోడేఘాట్వాసులు వాపోతున్నారు. సరైన ఇండ్లు లేక వానా కాలం బిక్కుబిక్కుమంటూ పూరిళ్లలోనే బతుకు ఈడుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘జల్.. జంగల్.. జమీన్’ పోరాటానికి వేదికైన జోడేఘాట్ ను బీఆర్ఎస్ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడుతున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ప్రభుత్వమైనా నిలిచిపోయిన ఇండ్లను పూర్తిచేయాలని, సొంతంగా ఇండ్లు కట్టుకున్నవారికి బిల్లులు రిలీజ్చేయాలని కోరుతున్నారు.
ఇంటి కోసం 15 ఆవులు అమ్మిన..
నాకు సర్కార్ మూడేండ్ల కింద ఇండ్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు భీమ్ లెవెల్ కు మాత్రమే కట్టినా. సర్కారు పైసలు ఇవ్వకపోవడంతో నేనే సొంతంగా ఖర్చు పెట్టుకున్న. అందుకోసం 15 ఆవులు అమ్మినా. ఒక ట్రాక్టర్ ఇసుకను ఆసిఫాబాద్ నుంచి తేవాలంటే రూ.10వేల నుంచి రూ.12 వేలు అవుతోంది. అంత పెట్టి నాలాంటి పేదోడు ఎలా తేగలడు. ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందన్న ఆశతో మొదలుపెట్టిన. ఇప్పుడు కుటుంబం మొత్తం పందిట్లో ఉంటున్నాం.
- కుమ్రం యశ్వంత్ రావు , లబ్ధిదారుడు, జోడే ఘాట్
ఇల్లు పీకి పందిరేసుకున్న..
ఇండ్లు మంజూరైందన్న ఆనందంలో గుడిసె పీకి పందిరి వేసుకున్న. అందులోనే కుటుంబం మొత్తం ఎండ, వాన, చలికి అవస్థ పడుతున్నం. ఇప్పటివరకు కేవలం పిల్లర్లు నిర్మాణం జరిగింది. మూడేండ్లలో ప్రభుత్వం రూ.74 వేల బిల్లు మాత్రమే ఇచ్చింది. ఇల్లు పూర్తి అవుతుందో? లేదో అధికారులకే తెలియాలి. కొత్త సీఎం మా గురించి అడిగారని కలెక్టర్ చెప్పి పోయిండు.
- కొట్నాక్ జైతు, లబ్ధిదారుడు, జోడేఘాట్
రూ.లక్ష అప్పు చేసిన
వ్యాపారుల దగ్గర వడ్డీకి రూ.లక్ష అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన. ప్రభుత్వం బిల్లు రూపంలో కేవలం రూ.60 వేలు మాత్రమే ఇచ్చింది. సరిపడా డబ్బులు లేక పిల్లర్ స్థాయిలోనే ఆపేసిన. బిల్లులు త్వరగా ఇస్తే నిర్మాణం చేస్తం. లేదంటే గవర్నమెంట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. మాకే ఎందుకు గిన్ని గోసలు. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ మాపై దయ చూపాలే.
- పెందోర్ కేశవరావు, లబ్ధిదారుడు, జోడేఘాట్ గ్రామ పటేల్
బెస్ మెట్ కట్టి వదిలేసిన..
బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసిన ఇండ్లు నిర్మించేందుకు గోస పడుతున్న. అప్పులు చేసి బెస్ మెట్ వరకు కట్టిన. ఏండ్లు గడుస్తున్నా బిల్లులు వస్తలేవు. నా వద్ద కట్టేంత స్తోమత లేదు. ఉన్న ఇల్లు పీకి పందిరిలో బతుకున్నం. చలికి గోస అయితంది. ఇప్పటి వరకు కేవలం రూ.53 వేలు మాత్రమే ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోయింది.
- కుమ్రం లచ్చు, లబ్ధిదారుడు, జోడేఘాట్