కేసీఆర్ ఐదేండ్ల పాలనలో 30 లక్షల ఎకరాలు నష్టం

వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు గత పదేండ్లలో రెండు సార్లు మాత్రమే గత బీఆర్ఎస్ సర్కారు​ నుంచి నష్ట పరిహారం లభించింది. అన్నదాతలు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినా గత సర్కారు ప్రిలిమినరీ రిపోర్టులకే పరిమితమైందే తప్ప.. రైతులకు పైసా ఇవ్వలేదు. ఇన్​పుట్​ సబ్సీడీ కింద మరో రెండుసార్లు సాయం అందినప్పటికీ అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చినవే కావడం గమనార్హం.  

గత ఐదేండ్లలో 30 లక్షల ఎకరాలు నష్టం..

గడిచిన ఐదేండ్లలోనే రైతులు దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2020లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 14.93 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. అయితే, ఇది కాగితాలకే పరిమితమైంది. 2021, 2022లో పంట నష్టం వాటిల్లినా ప్రిలిమనరీ రిపోర్ట్​ కూడా తయారు చేయలేదు.

నిరుడు ఎన్నికల సంవత్సరం కావడంతో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనాలు వేశారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించింది. రూ.500 కోట్లకు గాను రూ.150 కోట్లకు మాత్రమే బడ్జెట్​ ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకున్నారు.  2016, 2017, 2019, 2020లలో పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించినా పక్కన పెట్టేశారు. పంట బీమా పేరుతో ఇన్​పుట్ సబ్సిడీని పట్టించుకోవడమే మానేశారు. దాదాపు నాలుగేండ్ల నుంచి రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్​బీమా యోజన కూడా అమలు చేయడం లేదు.