తెలంగాణలో 30లక్షల ఏపీ ఓటర్లు.. బస్సులు, రైళ్లలో సీట్లు ఫుల్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో స్థిరపడిన ఏపీ వాసులు ఓట్ల కోసం సొంతూళ్ల బాట పట్టారు. ఈ నెల 13న తెలంగాణలో లోక్​సభ ఎన్నికలు జరగనుండగా, అదేరోజు ఏపీలో అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండుచోట్లా ఓటు హక్కు ఉన్న ఆంధ్రా వాసులు.. సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, దీనికి తోడు సెలవులు కూడా రావడంతో అక్కడికి తరలి వెళ్తున్నారు. 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతుండడం, ప్రతి ఓటు కీలకంగా మారడంతో గ్రేటర్ లో స్థిరపడినోళ్లు ఆంధ్రాకు తరలివెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా హైదరాబాద్​నుంచి వీకెండ్స్​(శని, ఆదివారాల్లో)లో మాత్రమే ఏపీకి రెండు వేలకు పైగా ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తాయి. కానీ గత వారం రోజులుగా హైదరాబాద్​నుంచి ప్రతిరోజూ బస్సులు కిక్కిరిసి వెళ్తున్నాయి. రానున్న ఐదారు రోజులకు కూడా అన్ని సీట్లూ బుక్​అయ్యాయి. ఏపీ వైపు వెళ్లే రైళ్లలోనూ అన్ని టికెట్లు రిజర్వ్​అయ్యాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని అక్కడి లీడర్లు ఓటర్లను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

ఇప్పటికే 40 శాతం మంది సొంతూళ్లకు.. 

రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు ఉన్నారు. వీరిలో 80 శాతానికి పైగా ఓటర్లు ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు అంచనా. దీంతో గ్రేటర్​ పరిధిలోని 4 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజీ తగ్గనుంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్​నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఏపీ ఓటర్లు ఉన్నారు. అలాగే నిజామాబాద్, మెదక్​ స్థానాల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఏపీ ఓటర్లు ఉన్నారు. సాధారణంగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. 

అలాంటిది ఇప్పుడు ఏపీ ఓటర్లు వెళ్లిపోతే, అది మరింత పడిపోయే ప్రమాదముంది. గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, ప్రగతినగర్, కేపీహెచ్ బీ, బీహెచ్ఈఎల్, అశోక్ నగర్, నిజాంపేట, కుత్బుల్లాపూర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, సరూర్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికే సెలవులు రావడంతో 40 శాతం మంది ఏపీలోని వివిధ జిల్లాలకు వెళ్లిపోయారు. రానున్న ఐదు రోజుల్లో మరో40శాతం మంది వరకు వెళ్లనున్నారు.  

పోలింగ్ కు ముందు వరుసగా సెలవులు.. 

పోయినేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ  నియోజకవర్గాల పరిధిలో 46.68 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఏపీ వాసులు ఎక్కువగా నివసించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటింగ్ శాతం 60లోపే ఉంది. పైగా ఈసారి పోలింగ్ సోమవారం జరుగుతున్నది. రెండో శనివారం, ఆదివారం తర్వాత పోలింగ్ డే (సోమవారం) ఉంది. ప్రభుత్వ, ఐటీ, బ్యాంకు ఉద్యోగులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. శుక్రవారం బసవ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ ​హాలిడే కూడా ఉంది. ఈ క్రమంలో ఏపీకి వెళ్లే ఆంధ్రా ఓటర్ల పర్సంటేజీ 90  శాతం దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ​వైపు మొగ్గు

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆంధ్రా వాసులంతా ఇప్పుడు ఏపీకి వెళ్తే ఆ ఎఫెక్ట్ ఏయే పార్టీలపై పడుతుంది? అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్ట్ సిటీ మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా వాసులు ప్రధానంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు స్పష్టమైంది. 

కానీ రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రావడంతో ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్​వర్సెస్​బీజేపీ అన్నట్టుగా మారాయి. దీంతో ఏపీ ఓటర్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటే, ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానివైపు మొగ్గుచూపేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ వాసుల ఓటర్లన్నీ ఈసారి కూడా తమకే పడేవని, వారు ఏపీకి వెళ్లడం వల్ల తమకే ఎక్కువ నష్టం జరుగుతుందని బీఆర్ఎస్​కు చెందిన ఓ లీడర్ పేర్కొన్నారు.