- ప్రతి జిల్లాలో యావరేజ్‌గా90 వేల ఫ్యామిలీలకు ఇండ్లు లేవు
- సొంత జాగా కూడా లేనోళ్లు 11.60 లక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలోనేఎక్కువ కుటుంబాలు
- ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వెల్లడి.. సర్కారుకు చేరిన లెక్కలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాల లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల 29 వేల 515 కుటుంబాలకు నివాసం ఉండటానికి ఇండ్లు లేవని ప్రభుత్వం గుర్తించింది. అంటే ప్రతి జిల్లాలో యావరేజ్‌గా 90 వేల కుటుంబాలకు ఇండ్లు లేవు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను వడపోసిన తరువాత ఈ లెక్క తేలింది. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ.. లక్షల్లో అర్హులకు అవి అందలేదని ఈ లెక్కలతో స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం గతేడాది అప్లికేషన్లు తీసుకున్నది. ఇందులో 80 లక్షలకు పైగా మంది తమకు ఇండ్లు లేవని వెల్లడించారు. ఇందరిమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్‌ను రెడీ చేసిన ప్రభుత్వం.. ఆ డేటా మొత్తాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి విశ్లేషించింది. నిజంగా ఇండ్లు లేనివారికి, పేదలకే ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చేపట్టిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని వెల్లడైంది. ఇందులో కొందరు గుడిసెల్లో, మట్టి గోడల ఇంటిలో నివాసం ఉంటున్న పేదలు కూడా ఉన్నట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తొలి విడతలో సొంత జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న వివరాల ప్రకారం సొంత జాగా ఉన్న కుటుంబాలు 18.68 లక్షలు ఉన్నాయి.
జాగా లేనోళ్లు ఎక్కువే..
ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్లో సొంత జాగా సైతం లేని కుటుంబాలు1.60 లక్షలు ఉన్నట్లు తేలింది. అయితే, ఈ కుటుంబాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ఉన్న అర్హుల లిస్టులో సొంత ఇండ్లు లేనప్పటికీ12 వేల కుటుంబాలకు ఇంటి జాగాలు ఉన్నాయి. అసలు సొంత స్థలం లేని కుటుంబాలు 4.45 లక్షలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువ మందికి హౌస్ సైట్స్ ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
అదే పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి
ఇంటి స్థలాలు లేవని పేర్కొన్నారు. అందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల మాదిరి ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది ఇండ్లు లేనోళ్లు ఉన్నారు. జిల్లాలో1.56 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని తేల్చారు. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 1.31 లక్షల ఫ్యామిలీలకు ఇండ్లు లేవు. అత్యల్పంగా జనగామ జిల్లాలో 39 వేల కుటుంబాలకు ఇండ్లు లేవని గుర్తించారు.
ఏటా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
ఇందిరమ్మ ఇండ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయనుంది. అంటే ఒక్కో నియోజకవర్గంలో 3,500 కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. ఇలా ఏటా 4.16 లక్షల ఇండ్లు ఇస్తారు. అయితే, ఐటీడీఏ, ఇతర రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఏటా 4.50 లక్షల ఇండ్లు ఇచ్చినప్పటికీ ఐదేండ్లలో 23 లక్షల కుటుంబాలకు ఇండ్లు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కింద విడతల వారీగా రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందుకోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులను సైతం వినియోగించుకోనుంది.