చత్తీస్​గఢ్​లో రెండు ఎన్​కౌంటర్లు 30 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో రెండు ఎన్​కౌంటర్లు 30 మంది మావోయిస్టులు మృతి
  • ఎన్​కౌంటర్ స్పాట్ నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
  • దండకారణ్యంలో కొనసాగుతున్న కూంబింగ్
  • 3 నెలల్లో 105 మంది మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్​కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. బీజాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో బస్తర్ నార్త్ విజన్ కమిటీ, కంపెనీ నంబర్ 5, మాడ్ కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం బలగాలకు అందింది. 

దీంతో వెంటనే బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణ్​పూర్, కాంకేర్ జిల్లాల్లోని జవాన్లు రంగంలోకి దిగారు. ఈ జిల్లాల ఎస్పీలందరూ కలిసి బుధవారం జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. కమాండర్ పాపారావు ఆధ్వర్యంలో 40 నుంచి 45 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు గుర్తించారు. డీఆర్​జీ, సీఆర్​పీఎఫ్ బలగాలు కూడా ఆపరేషన్​లో భాగస్వాములయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల పాటు ఫైరింగ్ కొనసాగింది. ఈ ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. 

డీఆర్​జీ జవాన్ రాజు ఓయ్మే అమరుడైనట్లు ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఎన్​కౌంటర్ తర్వాత డెడ్​బాడీలను అడవుల నుంచి తీసుకొస్తున్నట్లు చెప్పారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. దండకారణ్యంలో బస్తర్ నార్త్ డివిజన్, కంపెనీ నంబర్ 5, మాడ్ కమిటీలకు చెందిన మావోయిస్టులు సంచరిస్తున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. 

దీంతో డీఆర్​జీ, బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ చేపట్టాయి. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. రెండు ఎన్​కౌంటర్ స్పాట్ల నుంచి ఏకే 47, ఎస్​ఎల్ఆర్, ఆటోమేటిక్, సెమీ ఆటోమెటిక్ ఆయుధాలతో పాటు గ్రనైడ్లు, బీజీఎల్ లాంఛర్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

మందుపాతర పేల్చిన మావోయిస్టులు

నారాయణ్​పూర్ జిల్లాలోని అబూజ్​మాఢ్ ఏరియా తుల్ తులీ అటవీ ప్రాంతంలో కూంబింగ్​కు వెళ్లిన జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి హెల్త్ కండీషన్ బాగానే ఉందని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. 

ఈ ఏడాదిలో రెండో అతిపెద్ద ఎన్​కౌంటర్

గడిచిన 3 నెలల్లో జరిగిన ఎన్​కౌంటర్లలో 105 మంది మావోయిస్టులు చనిపోయారు. జనవరి 4న అబూజ్​మాఢ్ ఏరియాలో జరిగిన  ఎన్​కౌంటర్​లో ఒక మహిళతో సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలోనే ఒక డీఆర్​జీ జవాన్ కూడా అమరుడయ్యాడు. జనవరి 9న సుక్మా-, బీజాపూర్ బార్డర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. 12న బీజాపూర్ మద్దేడు ఏరియాలో ఐదుగురు, 16న చత్తీస్​గఢ్, తెలంగాణ బార్డర్​లోని పూజారి కాంకేర్​లో 18 మంది మావోయిస్టులు చనిపోయారు. 

20న చత్తీస్​గఢ్, ఒడిశా బార్డర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 2న బీజాపూర్ గంగులూరు ఏరియాలో 8 మంది, ఫిబ్రవరి 9న మద్దేడు, -ఫర్సేగఢ్​ ఏరియాలో 31 మంది చనిపోయారు. తాజాగా, గురువారం బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో 30 మంది చనిపోయారు. ఈ ఏడాది చోటుచేసుకున్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్లలో ఇది రెండో అతిపెద్ద ఘటన.​

2026 నాటికి మావోయిస్టు రహితంగా ఇండియా: అమిత్ షా

ఇండియాను మావోయిస్టుల రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది మరో పెద్ద విజయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నదని ట్వీట్​లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘‘2026, మార్చి 31 నాటికి.. దేశం మావోయిస్టు రహితంగా మారుతుంది. 

అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు మావోయిస్టులు లొంగిపోవడం లేదు. ‘నక్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముక్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దిశగా మరో పెద్ద విజయాన్ని సాధించాం’’అని ఆయన తెలిపారు. బస్తర్​కు భయం నుంచి విముక్తి లభిస్తుందని చత్తీస్​గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చత్తీస్​గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ తెలిపారు.