జంతు దినోత్సవం రోజే దారుణం.. 30 కోతులను చంపేసిన్రు..

  • పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లిలో కలకలం

సుల్తానాబాద్, వెలుగు: జంతు దినోత్సవం రోజున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో 30 కోతులను చంపి పడేశారు. చాలా గ్రామాల్లో కోతులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమందిని గాయపరుస్తున్నాయి. ఈ నెపంతో మండలంలోని ఏదో ఒక గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం 30 కోతులను చంపి రాత్రి టైంలో దుబ్బపల్లి సమీపంలో శ్మశానవాటిక పక్కన పడేసి వెళ్లారు.

గురువారం చూసిన గ్రామస్తులు..అధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగయ్య, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మంగీలాల్, దేవదాసు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెటర్నరీ డాక్టర్లు కోతులకు పోస్టుమార్టం నిర్వహించారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోతులను ఎవరు చంపారు?  ఎలా చంపారు? అనే విషయమై విచారణ జరుపుతున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.