ఉత్సాహంగా పోలీస్​ జాగిలాల పరేడ్

ఉత్సాహంగా పోలీస్​ జాగిలాల పరేడ్
  • రాష్ట్ర పోలీసులకు కొత్తగా30 జాగిలాలు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో(ఐఐటీఏ) శుక్రవారం 24వ బ్యాచ్‌‌ పోలీస్ జాగిలాల(కెనైన్స్‌‌) పాసింగ్‌‌ అవుట్ పరేడ్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంటెలిజెన్స్‌‌ డీజీ శివధర్‌‌‌‌రెడ్డి, ఐఎస్‌‌డబ్ల్యూ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్‌‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన 30 జాగిలాలతో పాటు బిహార్‌‌‌‌, గోవా, త్రిపురకు చెందిన డాగ్‌‌స్క్వాడ్‌‌తో సీఐఎస్‌‌ఎఫ్‌‌, ఆర్‌‌‌‌పీఎఫ్‌‌ చెందిన మరో 42 కెనైన్స్‌‌ పరేడ్ నిర్వహించాయి. వీటికి 101 మంది హ్యాడ్లర్లు 8 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. 

ఇంటెలిజెన్స్‌‌,సెక్యూ రిటీ వింగ్‌‌ కావలసిన విధంగా స్నిఫర్‌‌, ట్రాకర్‌‌ డాగ్స్‌‌కి ట్రైనింగ్ పూర్తి చేశారు. పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌‌, గంజాయి, నేరస్తులను గుర్తించడంలో ఆధునిక తరహాలో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సదర్భంగా శివధర్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లో డాగ్‌‌ స్వ్కాడ్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు పేలుడు పదార్థాలు, నార్కొటిక్స్‌‌ను గుర్తించండం, వీఐపీలు, వీవీఐపీల భద్రతలో అత్యత్తమ ప్రతిభ కనబర్చుతున్నాయని చెప్పారు. ట్రైనింగ్‌‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాల హ్యాండర్లకు డీజీ మెమోంటోలు అందించారు.