భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియలో భాగంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని సోమవారం ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు వి.పి. గౌతమ్, ప్రియంక అల తెలిపారు.
ఖమ్మం జిల్లాలో 14..
నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పాత్రికేయులతో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల స్క్రుటినీ ప్రక్రియ సోమవారం నిర్వహించినట్లు తెలిపారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 147 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, స్క్రుటినీలో 14 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు చెప్పారు. 133 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. పాలేరులో 40 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఇద్దరి నామినేషన్లు తిరస్కరించినట్లు చెప్పారు.
మధిరలో 17 మంది అభ్యర్థులవి చెల్లుబాటు కాగా, ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అయ్యాయని వివరించారు. వైరాలో 15 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఒక అభ్యర్థి తిరస్కరణకు గురయ్యారని తెలిపారు. సత్తుపల్లిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చెల్లుబాటు కాగా, ముగ్గురి నామినేషన్ తిరస్కరించినట్లు చెప్పారు. స్క్రూటినీ ప్రక్రియ ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 15 వరకు అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. ఉపసంహరణ దరఖాస్తుపై అభ్యర్థి సంతకం ఉండాలని, అభ్యరి నేరుగా గాని, అభ్యర్థి ప్రతిపాదిత వ్యక్తి గాని అందజేయవచ్చని తెలిపారు. అదేరోజు సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో గుర్తుల కేటాయింపు ఉంటుందని చెప్పారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 16...
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గానూ 16 నామినేషన్లను తిరస్కరించినట్టు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియంక అల తెలిపారు. కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాలకు 136 మంది క్యాండెట్లకు గానూ 211 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో పినపాకలో మూడు, ఇల్లెందులో నాలుగు, కొత్తగూడెంలో రెండు, అశ్వారావుపేటలో రెండు, భద్రాచలంలో ఐదు నామినేషన్లను తిరస్కరించినట్టు చెప్పారు.
ALSO READ : ఖేడ్‌లో నయా పాలిట్రిక్స్ .. ఒక్కటైన కాంగ్రెస్ దాయాదులు
ఇల్లెందు నుంచి కాంగ్రెస్ తరుపున నామినేషన్ వేసిన గుగులోత్ రవి ఇన్‌టైంలో బీ ఫారం సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇదిలా ఉండగా కొత్తగూడెం నియోజకవర్గంలో నామినేషన్లు వేసిన పలువురు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కొందరు కంప్లైంట్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. కాగా కంప్లైంట్స్‌పై ఏ నామినేషన్ తిరస్కరణకు గురికాలేదని కొత్తగూడెం రిటర్నింగ్ ఆఫీసర్ శిరీష పేర్కొన్నారు.