ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడికి సంబంధించి పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత వారిని కోర్టులో హాజరుపర్చారు. టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. దీనిపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై మంత్రి విడుదల రజిని స్పందించారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని.. దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బీసీ మహిళనైన తనని దాడులతో భయపెట్టలేరన్నారు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి అని రజిని ఆరోపించారు.