కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి: యూపీ సర్కార్ అధికారిక ప్రకటన

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి: యూపీ సర్కార్ అధికారిక ప్రకటన

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‎రాజ్‎లో జరుగుతోన్న మహా కుంభమేళాలో తొక్కి సలాట జరిగిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. తొక్కి సలాటలో పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో కుంభమేళా తొక్కిసలాట ఘటనపై యూపీ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. కుంభమేళాలో జరిగిన తొక్కి సలాటలో ఇప్పటి వరకు మొత్తం 30 మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో 90 మంది భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. 

మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ.. మౌని అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తానికి ముందు బుధవారం తెల్లవారుజామున 1 నుండి 2 గంటల మధ్య అఖారా మార్గ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.. భక్తులు సంగంలో ఒక్కసారిగా స్నానాలు చేసేందుకు ఎగబడటంతో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాట జరిగినట్లు ఆయన తెలిపారు. 

ALSO READ | కుంభమేళా చరిత్రలో చేదు అనుభవాలు.. 1954 తొక్కిసలాటలో 800 మంది చనిపోయారు..!

ఈ తొక్కిసలాటలో 90 మంది భక్తులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సహయక బృందాలు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ 30 మంది భక్తులు చనిపోయారని తెలిపారు. మృతుల్లో 24 మందిని గుర్తించామని.. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటన స్థలంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. సహయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.