పాక్​లో జంట పేలుళ్లు.. 30 మంది మృతి

  • మరో 40 మందికి గాయాలు
  • ఎన్నికల ముందు రోజు ఘటన
  • రాజకీయ పార్టీ ఆఫీసులే టార్గెట్​
  • పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తు

కరాచీ: జనరల్ ఎలక్షన్స్​కు ఒకరోజు ముందు పాకిస్తాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. పార్టీ ఆఫీసులే టార్గెట్​గా జరిగిన జంట పేలుళ్లలో 30 మంది చనిపోయారు. 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్​లోని పిషిన్ జిల్లాలో, అఫ్గానిస్తాన్​లోని బార్డర్ ఏరియాలో బుధవారం ఈ పేలుళ్లు సంభవించాయి. రెండు పవర్ ఫుల్ బ్లాస్ట్​లు జరిగినట్టు స్థానికులు తెలిపారు.

పిషిన్ జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థి అఫ్సంద్యార్ ఖాన్ కక్కర్ ఆఫీసు ముందు మొదటి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా.. 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత గంటలోపే ఆఫ్గానిస్తాన్ బార్డర్ లో ఉన్న ఖిల్లా అబ్దుల్లా ఏరియాలోని జామియత్ ఉలేమా ఇస్లామ్ (జేయూఐ) పార్టీ ఆఫీస్ ముందు రెండో బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ పది మంది చనిపోగా.. 22 మంది గాయపడ్డారు. 

మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు..

బ్యాగుల్లో టైమ్ బాంబ్ సెట్ చేసి ఆఫీసుల ముందు పెట్టి రిమోట్​తో పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.  

ఓటింగ్​ను అడ్డుకునేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం నిర్వహించే ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఈసీపీ) పోలీసులను ఆదేశించింది.

బలూచిస్తాన్​లో భద్రత..

ఎన్నికల ర్యాలీలు, అభ్యర్థులు, బహిరంగ సభలు, పార్టీ ఆఫీసులే లక్ష్యంగా టెర్రరిస్టు లు పేలుళ్లు జరుపుతున్నారు. బలూచిస్తా న్ ప్రావిన్స్​లోని పలుచోట్ల మంగళవారం ఒకే రోజు సెక్యూరిటీ పోస్టులు, ఎలక్షన్ క్యాంపెయిన్ ఆఫీసులు, ర్యాలీలపై 10 గ్రనేడ్​తో దాడులు చేశారు.

ఆదివారం నుంచి మొత్తం 50 సార్లు అటాక్ చేశారు. పాకిస్తాన్​లోని అతిపెద్ద ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌గా పిలిచే బలూచిస్తాన్‌‌‌‌‌‌‌‌ కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక సంస్థలు కొన్నేండ్లుగా తిరుగుబాటు చర్యలకు పాల్పడుతున్నాయి. పోయిన నెలలో జరిపిన దాడుల్లో 24 మంది మిలిటెంట్లు, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు సివిలియన్లు చనిపోయారు.