
- కడుపునొప్పి, వాంతులతో హాస్పిటల్‌లో చేరిన విద్యార్థులు
- హాస్టల్‌లో కనిపించని వార్డెన్.. తనకేమీ తెలియదని సమాధానం
కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా కౌడిపల్లి బాలికల హాస్టల్‌లో ఉంటున్న 30 మంది స్టూడెంట్లు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్లే... హాస్టల్‌లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 97 మంది స్టూడెంట్లు ఉంటున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఇడ్లీ తిన్న తర్వాత 30 మందికి కడుపునొప్పితో పాటు వాంతులు మొదలయ్యాయి. వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో స్టూడెంట్లు హాస్టల్‌లోనే ఉన్నారు.
చివరకు తోటి స్టూడెంట్ల సాయంతో హాస్పిటల్‌కు వెళ్లారు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. వారు హాస్పిటల్‌కు చేరుకున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న అనంతరం స్టూడెంట్ల పరిస్థితి కుదుటపడడంతో తిరిగి హాస్టల్‌కు పంపించారు. భోజనం సరిగా లేకపోవడం వల్ల స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఘటన జరిగితే వార్డెన్ సాయంత్రం వరకు కూడా హాస్టల్‌కు చేరుకోకపోగా... ఘటనపై వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా తనకేమీ సంబంధం లేదని, డాక్టర్‌తోనే మాట్లాడాలని చెప్పడం గమనార్హం.
స్టూడెంట్ల అస్వస్థత విషయం తెలుసుకున్న మెదక్ డీఎంహెచ్‌వో శ్రీరాం, కౌడిపల్లి ఆర్‌ఐ శ్రీహరి హాస్టల్‌కు వచ్చి స్టూడెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాత్రి మరో ముగ్గురు స్టూడెంట్లు మళ్లీ వాంతులు చేసుకోవడంతో వారిని తిరిగి హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శశికళ హాస్పిటల్‌కు చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు.