ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో 30వేలకు పైగా దొంగ ఓట్లున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు. సోమవారం తుమ్మల తరఫున లాయర్ల ప్రతినిధి బృందం ఢిల్లీలో ఈసీ అధికారులను కలిసి కంప్లైంట్ చేసింది. జిల్లాలో ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్ల నమోదు విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30వేలకు పైగా ఓట్లు ఇంటి నెంబర్లు లేకుండానే ఉన్నాయని వివరించింది.
దీనిపై కలెక్టర్, సీఈవో, ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తుమ్మల పేర్కొన్నారు. గతంలో చేసిన తొమ్మిది ఫిర్యాదుల వివరాలను కూడా చూపించారు. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇంటి నెంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్లు తొలగించిన తర్వాతే తుది జాబితా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.