యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని -భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి ఎంపీటీసీ కోమటిరెడ్డి సంతోషా భాస్కర్‌తో పాటు 300 మంది బీఆర్ఎస్ నాయకులు.. బుధవారం హైదరాబాద్ లోని ఎంపీ నివాసంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవబోతుందని సీఎం కేసీఆర్ చేపించుకున్న సర్వేల్లో తేలిందని, అందుకే కేసీఆర్ కొత్తరకం కుట్రలకు తెరతీశారని విమర్శించారు.
ఇందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు బీజేపీ, ఎంఐఎంతో చేతులు కలిపారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రెండుసార్లు ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన గొంగిడి సునీత అభివృద్ధిని పక్కనపెట్టి అక్రమదారిలో ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్య 50 వేల మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ ధనావత్ మోహన్ బాబు నాయక్ తదితరులు ఉన్నారు.