దళితబంధులో కొటేషన్ల పేరిట రూ. 300 కోట్ల అవినీతి

జమ్మికుంట, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీంలో బోగస్ కొటేషన్లతో జరిగిన రూ.300 కోట్ల  అవినీతిపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం హుజూరాబాద్​ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 17600 మందికి దళితబంధు యూనిట్లు మంజూరు చేసిందని, ఇదే అదనుగా కొందరు దళారులు ప్రవేశించి ఒక్కో కొటేషన్  కు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

యూనిట్ మంజూరైన లబ్ధిదారుడికి రూ.3 లక్షల విలువైన మెటీరియల్ ఇప్పించారన్నారు. మెజార్టీ యూనిట్లలో ఇదే జరిగిందన్నారు. జమ్మికుంట టౌన్, హుజూరాబాద్ టౌన్​లో అప్పటి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచరులు, అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు సుమారు రూ.300 కోట్ల మేర కమీషన్ల పేరుతో దోచుకున్నారని ఫిర్యాదులో వివరించారు. వారిపై సీఐడీ లేదా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థతో విచారణ జరిపించాలన్నారు. ఆర్ఆర్ యాక్ట్ చట్టం ఉపయోగించి డబ్బులు రికవరీ చేసి దళితబంధు లబ్ధిదారులకు ఇప్పించాలని కోరారు.