- బై బ్యాక్ ఓపెన్ ప్లాట్, డబుల్‌గోల్డ్, చిట్టీల పేరుతో చీటింగ్
- మొత్తం 3,600 మంది బాధితులు
- 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ఎండీ, ఏడుగురు అరెస్ట్
- మొత్తం 3,600 మంది బాధితులు
- బై బ్యాక్‌లోనే పెట్టుబడులు రూ.250 కోట్లు
- 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ఎండీతో పాటు మరో ఏడుగురు సహాయకులు అరెస్టు
గచ్చిబౌలి, వెలుగు: స్కీముల పేరుతో ఓ కంపెనీ ప్రతినిధులు ప్రజలను నట్టేట ముంచారు. బై బ్యాక్ ఓపెన్ప్లాట్ స్కీమ్, డబుల్‌గోల్డ్ స్కీమ్, గోల్డ్ చిట్టీల పేరుతో సుమారు 3,600 మంది నుంచి రూ.300 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్లిమిటెడ్కంపెనీ ఎండీతో పాటు అతని ఏడుగురు సహాయకులను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టుచేశారు.
ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి కైత్లాపూర్‌లోని రెయిన్ బో విస్టాస్‌లో ఉండే కలిదిండి పవన్‌కుమార్..12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాతృశ్రీ నగర్లో ఓ కంపెనీ ప్రారంభించాడు. ఇందులో సత్యనారాయణ, హరికృష్ణ ఇద్దరు డైరెక్టర్లు కాగా.. భాస్కర్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, జ్యోతి, మౌనిక, లావణ్య అసొసియేట్లుగా ఉన్నారు. కంపెనీ పేరుమీద బై బ్యాక్ ఓపెన్ ప్లాట్, డబుల్‌గోల్డ్ స్కీమ్, గోల్డ్ చిట్టీ పేరుతో మూడు స్కీములను పవన్ కుమార్ ప్రకటించాడు. ఇందులో పెట్టుబడులు పెడితే ఆకర్షణీయమైన లాభాలు వస్తాయని జనాలను నమ్మించాడు. బ్రోచర్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం నిర్వహించారు.
కస్టమర్లను స్కీమ్‌లలో జాయిన్ చేయిస్తే కమీషన్ ఇస్తానని తన సహాయకులను పవన్ ఆశపెట్టాడు. బై బ్యాక్ ఓపెన్ ప్లాట్ స్కీమ్‌లో రూ.8.8 లక్షలు పెడితే, 2 గుంటల భూమిని రిజిస్ర్టేషన్ చేయడంతో పాటు నాలుగు శాతం ప్రాఫిట్ ఇస్తామని, దీంతో పాటు ప్రతినెలా రూ.32 వేల చొప్పున 25 నెలల పాటు చెల్లిస్తామని కస్టమర్లను పవన్ కుమార్ అసోసియేట్లు నమ్మించారు. అలాగే, డబుల్ గోల్డ్ స్కీమ్‌లో రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే, 12 నెలల తర్వాత కస్టమర్‌కు రూ.8 లక్షల విలువైన గోల్డ్ బిస్కెట్ ఇస్తామని చెప్పారు. గోల్డ్ చిట్టీ స్కీమ్‌లో రూ.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌చేస్తే.. 3 శాతం వడ్డీతో ప్రతినెల రూ.15 వేల చొప్పున 19 నెలల పాటు ఇస్తామని, 20వ నెల మరో రూ.15 వేలు చెల్లిస్తామని, దాంతో పాటు పెట్టుబడిగా పెట్టిన 5 లక్షలు కూడా రిటర్న్ చేస్తామని కస్టమర్లను నమ్మించారు.