వచ్చే ఐదేళ్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామన్న కంపెనీ
హైదరాబాద్ వెలుగు: యూఏఈ కంపెనీ లులూ గ్రూప్ తెలంగాణలో రూ. 3,500 కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో తమ మొదటి షాపింగ్ మాల్ అండ్ హైపర్ మార్కెట్‌ను ఓపెన్ చేస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ సోర్సింగ్ (సేకరణ), లాజిస్టిక్స్ హబ్‌ల కోసం వచ్చే ఐదేళ్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి కిందటేడాది జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్‌తో ఎంఓయూలు కుదుర్చుకున్నామని లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ అన్నారు. తెలంగాణలో రూ.500 కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని అప్పుడు చెప్పామని, ఇందులో భాగంగా మొదటి ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో చేపడుతున్నామని అన్నారు. రూ.300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో కూకట్‌పల్లిలోని 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మంజీరా మాల్‌ను లులూ మాల్‌గా రీబ్రాండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఇందులోనే హైపర్ సూపర్ మార్కెట్ కూడా ఉంటుందని, 70 లోకల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఇక్కడ దొరుకుతాయని అన్నారు. 1,400 సీటింగ్ కెపాసిటీ ఉన్న 5 స్క్రీన్‌ల సినిమా హాల్స్ ఉంటాయన్నారు. ఫుడ్ కోర్టులు, చిల్డ్రన్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌లు ఈ మాల్‌లో ఉంటాయని వివరించారు. ఈ ఒక్క మాల్ వలన సుమారు 2 వేల మందికి ఉద్యోగాలొస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో లులూ మాల్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.
మాంసాన్ని ప్రాసెసింగ్ చేసే ప్లాంట్..
మాంసాన్ని ప్రాసెసింగ్ చేసే ప్లాంట్‌ను చెంగిచర్ల దగ్గర రూ.200 కోట్లతో ఏర్పాటు చేస్తామని లులూ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్లాంట్ కెపాసిటీ రోజుకి 60 టన్నులు. ఈ ప్రాజెక్ట్ వలన 2,500 మందికి ఉద్యోగాలొస్తాయని అంచనా. ఇంకో 18 నెలల్లో ఈ ప్లాంట్ ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది . వీటితో పాటు అదనంగా రూ.3,500 కోట్లను రానున్న ఐదేళ్లలో తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తామని లులూ గ్రూప్ పేర్కొంది. హైదరాబాద్‌లో మరిన్ని షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 2 వేల కోట్లను, సిటీ శివారుల్లో మినీ మాల్స్‌ను ఏర్పాటు చేయడానికి, తెలంగాణలోని ఇతర సిటీలు, టౌన్లలో షాపింగ్ మాల్స్‌ను పెట్టడానికి మరో రూ.1,000 కోట్లను ఖర్చు చేస్తామని వివరించింది. రాష్ట్రంలో పండే పంటలను ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఎయిర్‌పోర్ట్ దగ్గర అగ్రికల్చర్ సోర్సింగ్ అండ్ లాజిస్టిక్స్ హబ్‌ను కూడా ఏర్పాటు చేయాలని లులూ గ్రూప్ చూస్తోంది. ఫిషింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ALSO READ:వీడని ‘మల్లన్న సాగర్’ సమస్యలు
రాష్ట్రంలోకి టెలిపెర్ఫార్మెన్స్..
డిజిటల్ సర్వీస్‌లను అందించే ఫ్రెంచ్ కంపెనీ టెలీపెర్ఫార్మెన్స్ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ కంపెనీ సుమారు 3 వేల హై స్కిల్డ్ పర్సనల్స్‌కు జాబ్స్ ఇస్తుందని చెప్పారు. జులైలో అధికారికంగా తన ఫెసిలిటీని స్టార్ట్ చేస్తుందని అన్నారు.