కీవ్: ఉక్రెయిన్‌లోని మారియపోల్‌లో గతవారం డ్రామా థియేటర్‌పై రష్యా మిస్సైల్ దాడిలో ఎంత మంది మృతి చెందారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో దాదాపు 300 మంది మృతి చెంది ఉంటారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. దాడి జరిగిన సమయంలో థియేటర్ లో దాదాపు 1300 మంది తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. థియేటర్లో పిల్లలు శరణార్థులుగా తలదాచుకుంటున్నారని అక్కడి నేలపై రష్యన్ భాషలో రాసినా రష్యా బలగాలు ఆ థియేటర్పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే డ్రామా థియేటర్ నుంచి 200 మందిని రక్షించినట్లు రష్యా మీడియా ఇటీవలే వెల్లడించింది. దాడుల్లో వెయ్యి మందికి పైగా చనిపోయారన్న వాదనల్ని కొట్టిపారేసింది. అసలు ఆ రోజున తమ సైన్యం ఎలాంటి వైమానిక ఆపరేషన్ చేపట్టలేదని రష్యా మిలటరీ చెప్పింది. మరోవైపు శిథిలాల కింద దాదాపు 200 మంది కన్నా ఎక్కువ మందిని కాపాడినట్లు సిటీ మేయర్ సెర్గీ ఓర్లోవ్ చెప్పారు.