యోగి ఎట్ల చెబితే అట్ల!

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రూ. 300 లక్షల కోట్ల విలువైన షేర్లు..ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజిల్లో ఒకటి..ఇంత పెద్ద సంస్థను నడిపింది హిమాలయాల్లోని ఓ ‘యోగి’. ఏదో తెలుగు సినిమా కథలా అనిపిస్తున్నా ఇది నిజంగానే జరిగింది. మాజీ ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ సీఈఓ చిత్ర రామకృష్ణ ఓ యోగి చేతిలో కీలు బొమ్మలా ఎలా పనిచేసిందో సెబీ విచారణలో తేలింది. ఆల్గో ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌  స్కామ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా 2016 లో  చిత్ర రామకృష్ణను సెబీ తొలగించింది. అప్పటి నుంచి ఆమెపై, మరో నలుగురిపై దర్యాప్తులు జరపగా, తాజాగా సెబీ తన విచారణ డిటైల్స్‌‌‌‌‌‌‌‌ను బయటపెట్టింది.

దైవానికి మారు రూపం..

చిత్ర  2013 లో ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఎండీగా,  సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈని నడిపింది ఓ గుర్తు తెలియన యోగి మాటలు విని అంటే నమ్మాలని కూడా అనిపించదు. యోగి ఎవరికి చెబితే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌లు, శాలరీ హైక్‌‌‌‌‌‌‌‌. ఎంతమంది ఫైనాన్షియల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెప్పినా ఆమె వినేవారు కారని ఈ విషయం తెలిసిన వారు పేర్కొన్నారు.  ఈ గుర్తుతెలియని యోగిని శీరోణ్మునిగా చిత్ర రామకృష్ణ పిలిచేవారు.  20 ఏళ్లు టచ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా, వీరిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదని, మొత్తం ఈ–మెయిల్ ద్వారానే సంబాషణలు జరిగేవని సెబీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ద్వారా తెలిసింది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ  కీలక డేటాను, ఉద్యోగులు వివరాలను, కంపెనీల డిటైల్స్‌‌‌‌‌‌‌‌ను ఆమె ఈ గుర్తుతెలియని యోగికి పంపారని  సెబీ పేర్కొంది. ఈ విషయాలను చిత్ర రామకృష్ణ ఒప్పుకున్నారు కూడా. 

యోగి చెప్పాడని జాబ్‌‌‌‌‌‌‌‌..

యోగి చెప్పాడని ఫైనాన్షియల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌తో సంబంధంలేని ఓ వ్యక్తిని ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ఈలోని టాప్‌‌‌‌‌‌‌‌ 2 పొజిషన్‌‌‌‌‌‌‌‌ కోసం తీసుకున్నారు చిత్ర రామకృష్ణ. ఈ నియామకం కూడా ఆమె ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ సీఈఓ పదవిని చేపట్టిన కొన్ని నెలల్లోనే జరగడం విశేషం.  ఆనంద్ సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌ను ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చిత్ర  నియమించారు. ఆ తర్వాత కొన్ని వారాలకే చీఫ్ స్ట్రాటజిక్ అడ్వయిజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జాబ్‌‌‌‌‌‌‌‌ను ఆయనకు ఆఫర్ చేశారు. ఏకంగా రూ. 1. 68 కోట్ల శాలరీతో ఆనంద్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌ను తీసుకోగా, కొన్ని నెలలకే ఆతని శాలరీని మరో రూ. 15 లక్షలు పెంచారు. ఆ తర్వాత మరో 15 శాతం పెంచి ఏకంగా రూ. 2.31 కోట్లు ఇవ్వడానికి చిత్ర  అనుమతిచ్చారు. ఆనంద్  నియమితులయిన తర్వాత కంపెనీకి  ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చయ్యింది. తానే మానవుడిగా పుడితే అది ఆనంద్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌లా ఉంటానని ఈ గుర్తు తెలియని యోగి చిత్ర రామకృష్ణకు చేసిన ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌లో ఉండడం గమనార్హం. ఇంకా, ఆమెను ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నుంచి వెళ్లగొట్టినా, రూ. 44 కోట్ల   కాంపన్సేషన్‌‌‌‌‌‌‌‌ను చిత్ర రామకృష్ణ పొందగలిగారంటే నమ్మలేం.