భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

హిమాచల్ ప్రదేశ్ రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్‌పి) సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. జనవరి 30న జరిగిన ఈ ఘటనలో 300 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్న ATR సౌత్ పోర్టల్ (SP) సమీపంలో దాదాపు 50 వాహనాలు, ఒక హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) బస్సు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో ATR నుంచి పర్యాటకులందరినీ ఖాళీ చేయించారని కులు ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు.

అంతకుముందు హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీ హిమపాతం, జనవరి 30 నుండి ఫిబ్రవరి 3 వరకు వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా, లాహౌల్-స్పితి, కిన్నౌర్, చంబా, కులు, మండి, సిర్మూర్, సిమ్లా జిల్లాల్లోని ఎత్తైన ప్రాంతాలు, సిమ్లా, పరిసర ప్రాంతాలలో భారీ హిమపాతం, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని దిగువ కొండలు, మైదానాల్లోనూ ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశముందని, ఎత్తైన కొండలలోని పలు ప్రాంతాల్లో ఈ కాలంలో ఈదురు గాలులను రావచ్చని అంచనా వేసింది.