ఎల్బీనగర్,వెలుగు: గతంలో స్వాధీనం చేసుకున్న 3 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులు శనివారం ధ్వంసం చేశారు. రంగారెడ్డి జల్లా పెద్ద అంబర్ పేటలో సీసాల గోదాం వద్ద ఈ చర్యకు పూనుకున్నారు. ఒరిస్సా నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న ఈ మద్యాన్ని 2022 డిసెంబర్ లో హయత్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం, గంజాయి, గంజా చాక్లెట్స్ కు యువత దూరంగా ఉండాలని తెలిపారు. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని దీనిపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు.
10 వేల కిలోలకు పైగా నల్లబెల్లం
గతేడాది అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ లో పట్టుబడ్డ 10,500కిలోల నల్లబెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు మూసీలో కలిపారు. గౌరెళ్లి సమీపంలోని మూసీలో నల్లబెల్లాన్ని ముంచెశారు.ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు,హయత్ నగర్ సీఐ లక్ష్మణ్, ఇబ్రహీంపట్నం సీఐ టి. శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, ఎస్సై లు యాదయ్య వెంకన్న సిబ్బంది పాల్గొన్నారు.