
- అయోమయంలో కోళ్ల పెంపకందారులు
- లక్షల్లో నష్టపోతున్నమని పౌల్ట్రీ యజమానుల ఆవేదన
మెదక్, సంగారెడ్డి, వెలుగు: కోళ్ల మరణాలు పౌల్ట్రీ రైతులను పరేషాన్ చేస్తున్నాయి. ఓ వైపు వెటర్నరీ అధికారులు బర్డ్‌ఫ్లూ లేదని చెబుతున్నా మరో వైపు రోజుల వ్యవధిలో వేలాది కోళ్లు చనిపోతుండడం అటు పౌల్ట్రీ వ్యాపారులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుంటే వ్యాపారస్తులతోపాటు ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఒకపక్క చికెన్ వ్యాపారస్తులు, అధికారులు బర్డ్ ఫ్లూ లేదని ప్రచారం చేస్తుండగా మరోపక్క ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 20 వేల కోళ్లు మృతి చెందడం అందరిని కలవరపెడుతోంది.
చికెన్ ప్రియులు సైతం కోళ్లను కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో కోళ్లు చనిపోతుంటే పౌల్ట్రీ వ్యాపారస్తులు లక్షల్లో నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్న పశుసంవర్ధక శాఖ అధికారులు శాంపిల్స్ సేకరించడంతోనే సరిపెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృతి చెందుతున్న సంఘటనలు జిల్లాలో ఎక్కువవుతున్నాయి.
వారంలోనే 20 వేల కోళ్లు మృతి
సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్, చౌటకూర్ మండలాల్లో కేవలం వారం రోజుల వ్యవధిలో 20 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. చౌటకూర్ మండలం తాడ్దాన్ పల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారంలో మూడు రోజుల్లో 9 వేల కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లను ఫారం నిర్వహకులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి భూమిలో పాతిపెట్టారు. వెటర్నరీ అధికారులు ఫారాన్ని పరిశీలించి పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించినప్పటికీ కోళ్లు ఎలా చనిపోయాయని నిర్ధారణ కాలేదు. అలాగే చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం గిరిజన తండాలో రెండు రోజుల వ్యవధిలో 7 వేల కోళ్లు చనిపోయాయి. ఇలా సంగారెడ్డి మండలం ఫసల్వాది, సదాశివపేట మండలం ఆత్మకూరు, కంది పరిసర ప్రాంతాల్లో దశలవారీగా సుమారు 4 వేల కోళ్లు చనిపోయినట్టు తెలుస్తోంది.
మూతబడుతున్న పౌల్ట్రీ ఫారాలు
వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో జిల్లాలో అక్కడక్కడ పౌల్ట్రీ ఫారాలు మూతపడుతున్నాయి. చౌటకూర్ మండలం తాడ్దాన్ పల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారానికి తాళాలు వేసి నిర్వాహకులు వెళ్లిపోయారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఈ ఫారాన్ని లీజుకు తీసుకొని నడిపిస్తున్నట్టు తెలిసింది. ఒకేసారి 9 వేల కోళ్లు చనిపోవడంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేక పౌల్ట్రీఫారాన్ని వదిలేసి సొంతూరికి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా మరికొన్ని చోట్ల కూడా అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృతి చెందడం వల్ల వ్యాపారస్తులు కొంతకాలం పాటు పౌల్ట్రీ బిజినెస్ ను మానుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలోని కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలోని పౌల్ట్రీఫారంలో ఇటీవల 9 వేల కోళ్లు మృతి చెందాయి. మూడు రోజుల కింద కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌లోని ఓ పౌల్ట్రీ ఫారంలో 1,100 కోళ్లు చనిపోయాయి. మండల కేంద్రమైన కొల్చారంలోని పలు కోళ్ల ఫారాల్లో సైతం వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. టేక్మాల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పలు కోళ్లు మృతి చెందాయి.
ఆందోళన అవసరం లేదు
బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది వలస పక్షుల ద్వారా పక్షులకు మాత్రమే కాకుండా జంతువులకు, మనుషులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, శ్వాస ఆడకపోవడం, జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలతో చనిపోతాయి. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి మనుషులకు అంత సులభంగా వ్యాపించదు. వ్యాధి సోకిన కోళ్లతో సన్నిహితంగా ఉంటేనే వ్యాధి బారిన పడతారు. ఈ వ్యాధి సోకిన కోళ్ల పచ్చి గుడ్డు, చికెన్ తీసుకోవడం వల్ల వ్యాధి సోకే ప్రమాదం ఉంది. గుడ్డు, చికెన్ ను 75 డీగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉడికించడం వల్ల వైరస్ చనిపోతుంది. అపుడు గుడ్డు, చికెన్ నిరభ్యంతరంగా తినొచ్చు. - డాక్టర్ వెంకటయ్య, మెదక్ జిల్లా వెటర్నరీ ఆఫీసర్