కంటోన్మెంట్​ అభివృద్ధికి 303 కోట్ల నిధులు

కంటోన్మెంట్​ అభివృద్ధికి 303 కోట్ల నిధులు
  •   ఈక్వల్​ వాల్యూ ఇన్​   ఫ్రాస్ట్రక్చర్ కింద విడుదల 
  •    త్వరలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, నాలాల అభివృద్ధి
  •    ఎలివేటెడ్​ కారిడార్​ప్రాజెక్టులో భాగంగా పనులు

హైదరాబాద్​సిటీ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ ​కారిడార్, డబుల్​డెక్కర్ ఎలివేటెడ్​కారిడార్​కు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. ప్యారడైజ్​ నుంచి బోయిన్ పల్లి వరకు డబుల్​డెక్కర్, జేబీఎస్​ నుంచి శామీర్​పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్​చేయగా, రూ.3,812కోట్ల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ పనులు చేపట్టనున్నది. వీటి కోసం కంటోన్మెంట్​పరిధిలో భూసేకరణ కొనసాగుతోంది. పరిహారం కింద భూమినే ఇచ్చేందుకు సిద్ధమైంది.

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కంటోన్మెంట్​పరిధిలో భూమి సేకరించిన ప్రాంతాల్లో ‘ఈక్వల్​వాల్యూ ఇన్​ఫ్రాస్ట్రక్చర్’ కింద వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆయా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం బుధవారం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈక్వల్​వాల్యూ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కింద రూ.303.62 కోట్లు రిలీజ్​చేసింది. వీటితో వాటర్​బోర్డు అధికారులు కంటోన్మెంట్ లో అండర్​గ్రౌండ్​డ్రైనేజీ వ్యవస్థను డెవలప్​చేయనున్నారు.

జీహెచ్ఎంసీ అధికారులు పికెట్ నుంచి శేషాచల కాలనీ, ఎల్ఐసీ కాలనీ, జూబ్లీబస్​స్టేషన్, ఎంట్రెంచ్​రోడ్​గుండా పారే నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించనున్నారు. హస్మత్​పేట ప్రోగ్రెస్​కాలనీ, రాయల్​ఎన్​క్లేవ్, పార్క్​వ్యూ ఎన్​క్లేవ్, సెయిల్​కాలనీ, భావన నగర్, చిన్నతొకట్ట, బేగంపేట ఎయిర్ పోర్టు​నుంచి ప్యాట్నీ మీదుగా ఇందిరమ్మనగర్, రసూల్​పురా వరకు ఉన్న నాలాకు రిటైనింగ్​వాల్స్ నిర్మించనున్నారు.

స్పెషల్​ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

ఎలివేటెడ్​ కారిడార్​​ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేయాలంటే తప్పని సరిగా హెచ్​ఎండీఏ, జీహెచ్ఎంసీ, రక్షణ శాఖ, ఎయిర్​పోర్టు అథారిటీ అధికారులు సమన్వయంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భూముల సేకరణ, యుటిలిటీల తరలింపు కోసం ఆయా శాఖలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులు సవ్యంగా జరగాలన్నా పరస్పర సహకారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో వివిధ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.