IND vs ENG: ఏకంగా 30 కోట్ల మంది.. ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సరికొత్త రికార్డు

IND vs ENG: ఏకంగా 30 కోట్ల మంది.. ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సరికొత్త రికార్డు

భారత్, ఇంగ్లాండ్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు ఎగబడుతున్నారు. జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ వస్తున్న ఈ మ్యాచ్ ను ఏకంగా 30 కోట్ల మంది వీక్షించడం జరిగింది. భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. ఈ సమయంలో వ్యూయర్ షిప్ ఏకంగా 30 కోట్లు దాటిపోవడం ఈ మ్యాచ్ క్రేజ్ ను తెలియజేస్తుంది.

తొలి ఇన్నింగ్స్ లో తన పదునైన యార్కర్ లతో ఇంగ్లాండ్ ను ముప్పు తిప్పలు పెట్టిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చూసేందుకు అభిమానులు బాగా ఆసక్తి చూపించినట్టు అర్ధమవుతుంది. ఒక టెస్టు మ్యాచ్ కు ఇలా బ్రహ్మ రధం పట్టడం ఈ ఫార్మాట్ విలువని తెలియ జేస్తుంది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఇంగ్లాండ్ 4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. బెన్ డకెట్(9), క్రాలి (10) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 379 పరుగులు చేయాలి. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. 
          
ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 143 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. యువ బ్యాటర్ శుభమాన్ గిల్ 104 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) చేయడంతో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బుమ్రా దెబ్బకు 253 పరుగులకే ఆలౌటైంది. క్రాలి 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.