న్యూఢిల్లీ: మనదేశం నుంచి అక్రమంగా రవాణా అయిన 307 పురాతన విగ్రహాలు, వస్తువులను అమెరికా భారతదేశానికి తిరిగి ఇచ్చేసింది. ఇవన్నీ గతంలో మన దేశం నుంచి అఫ్గానిస్తాన్, కంబోడియా ఇండోనేషియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలకు, అక్కడ్నుంచి అమెరికాకు ఇల్లీగల్‌గా రవాణా అయ్యాయి. న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ వస్తువులను అప్పగించినట్లు మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం తెలిపింది. 15 ఏండ్ల విచారణ తర్వాత ఎట్టకేలకు ఆ వస్తువులన్నీ యూఎస్ తిరిగి ఇండియాకు అప్పగించింది. వీటి విలువ రూ.33 కోట్లు.
స్మగ్లర్ సుభాష్ నుంచే 235 వస్తువులు..
పురాతన వస్తువులను సుభాశ్ కపూర్ స్మగ్లింగ్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 12–13వ శతాబ్దానికి చెందిన మార్బుల్‌తో తయారు చేసిన ‘ఆర్చ్ పరికర’ను కపూర్నుంచి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.70లక్షలపైనే ఉంటుందని ఇండియా కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ చెప్పారు. ‘ఆర్చ్ పరికర’ను నాథన్ రుబిన్ ఇడా లాడ్ ఫ్యామిలీ, 2007లో యాలే యూనివర్సిటీ ఆర్ట్ గ్యాలరీకి డొనేట్ చేసిందని, అక్కడి నుంచి కపూర్ ఎత్తుకొచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు. కపూర్, అతని గ్యాంగ్ నుంచి 2011–2022 మధ్య 2,500 వస్తువులను హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ రూ.1,188 కోట్లు ఉంటుందన్నారు. 2022లో రూ.697 కోట్లు విలువ చేసే 682 వస్తువులను 13 దేశాలకు యూఎస్ అప్పగించింది. ‘పురాతన వస్తువుల ట్రాఫికింగ్ యూనిట్’ ఏర్పాటు చేసినప్పటి నుంచి రూ.1,328 కోట్లు విలువ చేసే 2,200 వస్తువులను 22 దేశాలకు అప్పగించింది.